పిడుగుపాటుతో ఆవు, దూడ మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో ఆవు, దూడ మృతి

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

బాడంగి: మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి వాడాడ గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాథరావు ఆవు, దూడ మృతిచెందాయి. రోజూమాదిరిగా ఆవును, దూడను గ్రామం బయట ఉన్న మంచినీటికోనేరు గట్టుపై మేతకు వదిలిపెట్టగా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పిడుగుపడి మేస్తున్న ఆవు, దూడలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు వాపోయాడు. పశువైద్యాధికారికి సమాచారమివ్వగా డాక్టర్‌ వచ్చి పోస్టుమార్టం చేసినట్లు చెప్పాడు.

32 గొర్రెలు, మేకలు..

తెర్లాం: మండలంలోని నందిగాం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడడంతో 32 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కోరాడ చిన్నప్పడు, నీలబోను సూర్యనారాయణ, మొగుడు పైడియ్యలు తమ గొర్రెలు, మేకలను మేత కోసం నందిగాం పొలాల్లోకి తోలుకొని వెళ్లారు. మధ్యాహ్న సమయంలో మేకలు, గొర్రెలు మేత మేస్తున్న ప్రదేశంలో పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో మందలోని 32 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. అంతవరకు మేత మేస్తున్న జీవాలన్నీ ఒక్కసారి మృత్యువాత పడడంతో రైతులు లబోదిబోమంటూ విలపించారు. పిడుగుపాటుకు మృతి చెందిన గొర్రెల రైతులను తెర్లాం పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు, నందిగాం మాజీ సర్పంచ్‌ సత్యంనాయుడు, స్థానిక వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు పరామర్శించారు.

సాయిలక్ష్మికి సాయం

వేపాడ: ఆగిపోతున్న గుండెసవ్వడిని నిలుపుకోవడానికి ఆపన్నుల సాయం కోసం ఆరాటపడుతున్న సాయిలక్ష్మికి సాయం అందివ్వాలని యువజన సంఘం సంకల్పించింది. సాక్షి పత్రికలో ‘ఒక పరికరం..ఒక ప్రాణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వేపాడ మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన సీతారామా యువజన సేవా సంఘం సభ్యులు స్పందించారు. సాయిలక్ష్మికి వైద్య సాయం కోసం సంఘం సభ్యులంతా తలా ఒకింత వేసుకుని రూ.17000లు పోగేశారు. ఆదివారం సంఘం సభ్యులు బల్లంకి గ్రామంలో సాయిలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెకు రూ.17వేల నగదును అందించారు. తమకు చేతనైనంత మేర సాయం అందేలా కృషి చేస్తామని, సాయిలక్ష్మి కోలుకుంటుందని, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అలాగే రాజాం దగ్గర సంతకవిటి మండలానికి చెందిన వల్లేరు శ్రీనివాసరావు సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావుకు రూ. 5 వేలు ఫోన్‌పే చేశారు. బాధితురాలిని ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement