విజయనగరం: జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ రన్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా కోట వద్ద చిన్నారితో బెలూన్ ఎగర వేయించి క్రీడాజ్యోతి వెలిగించి, క్రీడాకారులు క్రీడాభిమానులతో కలిసి అడుగులు వేస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైతన్యం నింపుతూ నగరంలోని కోట దగ్గర నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, మెయిన్ రోడ్డు, మార్కెట్ సెంటర్, రాజీవ్ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా రంగంలో జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వల్లూరి శ్రీనివాసరావు, బంగారు ఉష, పల్లవిలతోపాటు కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పి.సతీష్, జి.నరసింగరావు, కృష్ణారెడ్డి, శాంతారావు, ఎక్స్ ఆర్మీ మేన్ రామారావులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్. వేణుగోపాలరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విజయ్, సత్య కాలేజీ ప్రిన్సిపాల్ సాయిదేవమణి, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి గోపాల్, మల్లేశ్వరరావు, ఖోఖో అసోసియేషన్ ప్రతినిధి ఏఎన్‌ఎం కమలనాభరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి పి.లీలాకృష్ణ శ్రీనివాసరావు, డీఎస్‌ఏ శిక్షకులు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోచ్‌లు, వందలాది మంది క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


