విషాద తీరం | - | Sakshi
Sakshi News home page

విషాద తీరం

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

విషాద తీరం

సంతబొమ్మాళి: కుమారులు ఉన్నత చదువులు చదువుతారని ఆ తల్లిదండ్రులు ఆశించి ఉంటారు.. చక్కగా చదువుకుని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటారని ఆకాంక్షించి ఉంటారు.. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఆకాంక్షలు తీరకుండాపోయాయి. భావనపాడు తీరంలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. టెక్కలి ఐతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న గోరివంకల అగస్త్య, సారిపెంట యశ్వంత్‌లతో పాటు జర్జన అభిలాష్‌, రాగాల హేమంత్‌, కాడి నరేంద్ర, పట్నాన గోవింద్‌, మామిడి రాకేష్‌లు ఆదివారం భావనపాడు సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో సరదాగా స్నానానికి దిగారు. అలల ఉద్ధృతికి అగస్త్య, యశ్వంత్‌లు ఇద్దరూ సముద్రం లోపలకు వెళ్లిపోయారు. మిగతా వారు వారిని కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భావనపాడు తీరంలో ఒక మృతదేహం తేలగా, మరో మృతదేహం దేవునల్తాడ తీరానికి చేరుకుంది. సంఘటనా స్థలానికి మైరెన్‌ సీఐ రాము, నౌపడ ఎస్‌ఐ జి.నారాయణస్వామి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో అగస్త్య స్వగ్రామం విశాఖపట్నం జిల్లా కశింకోట. ఐతం కళాశాలలో ఫస్ట్‌ ఇయర్‌ ఐటీ చదువుతున్నాడు. సారపెంట యశ్వంత్‌ స్వగ్రామం విజయనగరం జిల్లా మెరకముడిదాం. ఫస్ట్‌ ఇయర్‌ ఈసీఈ చదువుతున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement