విజయనగరం అర్బన్:
ఊరి బడిపై సర్కారు చిన్నచూపు చూస్తుందా అంటే జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. బడి తెరిచిన రోజే విద్యార్థికి అందాల్సిన విద్యామిత్ర కిట్లు నేటికీ పూర్తి స్థాయిలో అందలేదు. షూస్, బ్యాగులు, దుస్తులు, పుస్తకాలు... ఇలా అన్నింటా కోత పెట్టడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏ పాఠశాలలో చూసినా పాతవి, చిరిగిన బ్యాగుల్లోనే చిన్నారులు పుస్తకాలు తీసుకెళ్లేందుకు సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 1,11,190 జతల షూస్ కోసం విద్యాశాఖ అధికారులు ఇండెంట్ పెట్టగా, అందినవి కేవలం 37,910 జతలు మాత్రమే. అంటే ఏకంగా 73,289 మంది విద్యార్థులకు షూస్ అందలేదు. మొత్తం 27 మండలాలకు కేవలం 21 మండలాలకే విద్యామిత్ర కిట్లు అరకొరగా సరఫరా కావడం గమనార్హం. ప్రభుత్వం విద్యామిత్ర పేరుతో పేదకుటుంబాల చిన్నారులకు మిత్రద్రోహం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● చిరిగిన
సంచుల్లోనే
పుస్తకాలు...
బ్యాగుల కథ మరింత దారుణంగా ఉంది. 1,11,199 బ్యాగులకు గాను కేవలం 62,316 మాత్రమే వచ్చాయి. దాదాపు 50 వేల మంది విద్యార్థుకు స్కూల్ బ్యాగులు ఇప్పటికీ అందలేదు. 27 మండలాల్లో కేవలం 16 మండలాలకే ఇవి పరిమితం కావడం విశేషం. మిగిలిన 11 మండలాల పిల్లలు చిరిగిన పాత సంచులతోనే తరగతులకు వెళ్తున్నారు. యూనిఫారంలు కూడా సగమే. మొత్తం 1,11,199 దుస్తుల ఇండెంట్‌కుగాను 1,06,568కి మాత్రమే సరఫరా అయ్యాయి. వేలాది మంది విద్యార్థులు ఇంకా కొత్త బట్టల కోసం ఎదురుచూస్తున్నారు.
గగనంగా మారిన విద్యామిత్ర కిట్లు
గతంలో పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థుల చేతికి విద్యాకానుకలు
ఈ ఏడాది 73 వేల మంది బూట్లకు నోచుకోని వైనం
50 వేల మందికి అందని బ్యాగులు
ఇండెంట్ పెట్టినా సరఫరా చేయని దుస్థితి


