‘సమగ్ర శిక్ష’లో అక్రమాలపై.. హైలెవెల్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

‘సమగ్ర శిక్ష’లో అక్రమాలపై.. హైలెవెల్‌ విచారణ

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

‘సమగ్ర శిక్ష’లో అక్రమాలపై.. హైలెవెల్‌ విచారణ

టెండర్లు లేని దోపిడీపై ఎడ్యుకేషన్‌

కమిషనర్‌కి కలెక్టర్‌ లేఖ

రంగంలోకి దిగనున్న ఉన్నతాధికారుల బృందం

ఉచ్చు బిగుస్తున్న వేళ.. అధికారుల్లో వణుకు

‘నేతాజీ ఆవాసీయ’ అక్రమాలపై కదిలిన యంత్రాంగం

విజయనగరం అర్బన్‌:

మగ్ర శిక్ష అభియాన్‌లో సివిల్‌ వర్క్స్‌ విభాగంలో ఏళ్ల తరబడి సాగుతున్న వసూళ్ల దందాలు, కమీషన్ల లూటీ విషయం ఎట్టకేలకు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర విద్యా శాఖ దృష్టికి వెళ్లింది. టెండర్లు లేకుండా, చివరకు కలెక్టర్‌ కళ్లుగప్పి ‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆవాసీయ విద్యాలయం’ ఆధునికీకరణ పేరిట రూ.9 లక్షలు డ్రా చేసిన వ్యవహారం, బిల్లుల కోసం కాంట్రాక్టర్లను పీడిస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మెగా స్కా మ్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నతాధికా రుల బృందం రంగంలోకి దిగుతోంది. పలువురు కాంట్రాక్టర్లు, పట్టణానికి చెందిన ఎంఎస్‌ శ్రీనివాసరావు సమగ్ర శిక్ష విభాగంలో బరితెగింపులు, వేధింపులపై కలెక్టర్‌, ప్రభుత్వానికి లిఖిత పూర్వక ఫిర్యా దులు చేశారు. అనాథ పిల్లల విద్యాలయాల పను ల్లో సైతం టెండర్లు లేకుండా లక్షల రూపాయలు బొక్కేయడం, సైట్‌ ఇంజినీర్ల ఇష్టారాజ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో గట్టిగా డిమాండ్‌ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్ప డిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు.

కమిషనర్‌కు కలెక్టర్‌ కీలక లేఖ

ఫిర్యాదుదారులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌.. తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంపై కేవలం స్థానిక విచారణ సరిపోదని భావించిన కలెక్టర్‌, రాష్ట్ర ఎడ్యుకేషన్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. సమగ్ర శిక్ష విభా గంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై నిష్పక్షపాతంగా నిజాలు బయటకు రావా లంటే.. ‘రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల బృందం’తో సంయుక్త విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు. కలెక్టరే చైర్మన్‌గా ఉన్న కమిటీని పక్కనపెట్టి నిధులు డ్రా చేసిన తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఉచ్చు బిగుస్తున్న వేళ.. అధికారుల్లో వణుకు

ఈ వ్యవహారంపై ఇప్పటికే విద్యా శాఖ ప్రాంతీయ సంచాలకులు (ఆర్‌జేడీ) విజయభాస్కర్‌ రహస్య విచారణ జరపగా దాని పర్యావసనం సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలోని సూపరింటెండెంట్‌పై పడింది. మాతృ శాఖకు సరెండర్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పరిధిలో ఉన్నతాధికారుల బృందం జిల్లాకు రానుండడంతో అవినీతి చక్రం తిప్పిన సదరు సైట్‌ ఇంజినీర్‌, డీఈఈలతో పాటు లంచాలు ఇచ్చుకోమంటూ కాంట్రాక్టర్లకు సలహా ఇచ్చిన ఉన్నతాధికారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భవనాల ఆధునికీకరణ పనుల్లో రికార్డుల మాయాజాలం, సీఎఫ్‌ఎంఎస్‌ డ్రా వివరా లు, ఆటిజం కేంద్రాల బిల్లుల నిలిపివేత వెనుక ఉన్న అసలు దందాను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంతో సమగ్ర శిక్ష విభాగంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన అవినీతి తిమింగలాల ఆట కట్టవుతుందని బాధితులైన కాంట్రాక్టర్లకు న్యాయం జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement