పేరుకే మాణిక్యం | - | Sakshi
Sakshi News home page

పేరుకే మాణిక్యం

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

న్యూస్‌రీల్‌

విజయనగరం
వాస్తవానికి..

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

నిబంధనల ప్రకారమే..

సమగ్ర శిక్ష విభాగంలోని ఇటీవల చేపట్టిన 8 సెక్టోరియల్‌ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ జరిగింది. ఎలాంటి అక్రమాలు జరగలేదు. 8 పోస్టులలో రెండు పోస్టులకు అర్హత లేని కారణంగా భర్తీ చేయలేదు. మిగిలిన ఆరు పోస్టులకు ఎంపిక పూర్తయింది. వారంతా బాధ్యతలు తీసుకున్నారు.

– యు.మాణిక్యం నాయుడు, డీఈవో

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

విద్యల జిల్లా విజయనగరానికి ఒక మాణిక్యం దొరికింది... అలాంటిలాంటి మాణిక్యం కాదు.. తన శాఖలోని ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వాళ్లకు టైం చూసి బ్రేక్‌ ఇస్తారు. ఎవరూ గుర్తించని వాళ్లకు ఆయన ఒక ఆలంబన...ఆయన మాటలు సూక్తులు చూస్తే ఆహ.. ఏమి విలువలు.. ఏమి మాటలు.... ఈయన మట్టిలో మాణిక్యం అనిపిస్తుంది. ఇదంతా నాణేనికి ఓ వైపు.. రెండో వైపు చూస్తే.. విద్యా శాఖలో దందా చేస్తున్న ఈ పెద్దాయన దెబ్బకు అర్హులైన టీచర్లు అల్లాడిపోతున్నారు. ప్రైవేటు స్కూళ్ల వసూళ్ల వరకు అన్నీ సొంతంగానే బేరాలు కుదుర్చుకునే ఈయన కనీసం సొంత శాఖకు చెందిన వారిని డెప్యూటేషన్‌ మీద వేసేటప్పుడైనా వెనుకా.. ముందూ చూసుకోవాలి కదా.. అదేం లేదు.. క్యాష్‌ కొట్టు... పోస్టింగ్‌ పట్టు అనే పాలసీ మీద కథ నడిపించేస్తున్నారు.

జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీ కోసం తాజాగా జారీ చేసిన డెప్యుటేషన్‌ ఉత్తర్వులు విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురు ఉపాధ్యాయులను ఒక సంవత్సరం కాల పరిమితికి ఫారిన్‌ సర్వీస్‌ నిబంధనలు, షరతుల కింద జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ (ఎంపీసీ ) కార్యాలయానికి డెప్యుటేషన్‌పై నియమించారు. ఈ నియామకాల వెనుక జరిగిన ఎంపిక ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో గగ్గోలు మొదలైంది. ఇంటర్వ్యూలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆధ్వర్యంలో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. దీని ప్రకారం పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎంపికలో అర్హతలు, అనుభవం, సీనియారిటీ వంటి ప్రమాణాలను పక్కనబెట్టి ముందే నిర్ణయించిన అభ్యర్థులను సెలెక్ట్‌ చేసి పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎంపికతో సరా...

సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ఉన్నత స్థానాలు ఎంపిక చేసేసారు సరే.. వీళ్లు తమకన్నా సీనియర్లు.. ఉన్నతాధికారులైన ఎంఈవోలతో సమన్వయం చేసుకోవడం.. వారికి కొన్ని సందర్భాల్లో మార్గదర్శనం చేయడం కుదిరే పనేనా.. పోస్టింగ్‌ ఇచ్చేశాం అంటే సరికాదు.. వారు ఎవరితో కలిసి పని చేయాలి.. ఎలాంటి ఫలితాలు సాధించాలనే దాన్ని బట్టి కదా పోస్టింగులు ఇవ్వాలి. సరిగ్గా ఇదే అంశం టీచర్లలో చర్చకు తావిస్తోంది.

దీంతో పాటు రెండు అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారి (ఏఎస్‌ఓ) పోస్టులకు మరో ఇద్దర్ని ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పేర్లు పంపగా వారికి కంప్యూటర్‌ పరిజ్ఞానం లేదని వారి పేర్లను తిరస్కరించారు. అంటే తలా.. మొలా.. చూసుకోకుండా కేవలం బరువు చూసి పేర్లు పంపేయడం ద్వారా జిల్లా యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో పరువు పోగొట్టుకున్నట్లు అయింది. దీంతో మొత్తం ఎనిమిది పోస్టులకు లిస్ట్‌ పంపితే ఆరు మాత్రమే ఖరారయ్యాయి. అందులోనూ అన్నీ లొసుగులు కావడం మన మాణిక్యం దూరదృష్టికి తార్కాణం అని టీచర్లు గోల పెడుతున్నారు.

పర్యవేక్షణ బాధ్యతలకు సరిపోతుందా?

పోస్టింగులు ముందే ఫిక్స్‌ చేసారా..

ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం, అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు మాత్రమే తక్కువ స్థాయి హోదాలో ఉన్న వారికి అవకాశం కల్పించవచ్చు. కానీ ఈ సందర్భంలో ఉన్నత అర్హతలు కలిగిన నలుగురు స్కూల్‌ అసిస్టెంట్లు ఇంటర్వ్యూకు హాజరైనప్పటికీ వారిని పూర్తిగా విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చేటపుడే మన మాణిక్యం టాలెంట్‌ చూపించి ఎవరైనా దరఖాస్తు చేస్తుకోవచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో పాటు సీనియర్లు స్కూల్‌ అసిస్టెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హతలు.. అనుభవాన్ని బట్టి మార్కులు కొన్ని జమ అవుతాయి. అవన్నీ కలిపి ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి మెరిట్‌ ప్రకారం పోస్టింగులు వేయాలి. కానీ అవేం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే లైన్‌ మీద ఈయన తనకు నచ్చిన వాళ్లను ముందే సెలెక్ట్‌ చేసేసి పోస్టింగులు ఇచ్చేశారు. దీంతో సీనియారిటీ.. ఎంఈడీ, ఎమ్మేస్సీ వంటి ఉన్నత అర్హతలు ఉన్నవాళ్లు నష్టపోయారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో ఆయన లాభపడ్డారు.

గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులో మతలబు

ఈ పోస్టుకు నిర్వహించిన ఇంటర్వ్యూకు ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు హాజరవగా వారిలో నలుగురు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) హోదాలో పని చేస్తున్నవారు కాగా, ఒకరు మాత్రం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ). అయితే ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లను పక్కనబెట్టి గుర్ల మండలం కొమ్మనపేట ఎంపీపీఎస్‌లో పని చేస్తున్న ఒక ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిని జీసీడీవోగా ఎంపిక చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.

జీసీడీవో పోస్టు కేవలం కార్యాలయ పరిపాలనా బాధ్యతలకు మాత్రమే పరిమితం కాదు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పనితీరు, విద్యా ప్రమాణాలు, బాలికల సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ స్థాయి విద్య కూడా కొనసాగుతోంది. అక్కడ పని చేసే స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్ల పనితీరును సమీక్షించే బాధ్యతలు జీసీడీవోపై ఉంటాయి. ఇలాంటి బాధ్యతలు నిర్వహించే పోస్టుకు అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి ఎస్‌జీటీ స్థాయి అభ్యర్థిని ఎంపిక చేయడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నియామకాల్లో కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ (సీఎంవో), ఆల్టర్నేటివ్‌ స్కూలింగ్‌ కో–ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ (ఏపీవో), అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ (రెండు పోస్టులు), గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. వీటి ఎంపికలో అభ్యర్థుల విద్యార్హతలు, సేవా అనుభవం, సీనియారిటీ, గత పనితీరు వంటి అంశాలను పక్కనబెట్టి డబ్బులిచ్చిన ఇచ్చిన వాళ్లకు పోస్టింగులు ఇచ్చేశారన్న ఆవేదన సీనియర్‌ టీచర్లలో వెల్లువెత్తుతోంది. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మార్కుల వివరాలు, ఎంపిక ప్రమాణాలు, మెరిట్‌ జాబితాలు బయటకు రాలేదు. ఫైనల్‌ పోస్టింగులు జాబితా మాత్రం బయటకు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు.

అక్రమార్కులకు అందలం

పోస్టింగులు... డెప్యూటేషన్లు.. అన్నిటికీ ఒక రేటు.. అదే అయన రూటు

అర్హతలు బుట్టదాఖలు...

పేమెంట్‌ చేస్తే పోస్టింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement