చీపురుపల్లి: చేగువేరా సిద్ధాంతాలతో మార్పు కోసం పుట్టిందని ఊగిపోతూ చెప్పిన పవనన్న గ్లాసు పార్టీలో వసూళ్ల దందా బట్టబయలు అయ్యింది. ఆ పార్టీ అధినేత ప్రసంగాలు చూసి ప్రభావితులై ఆ పార్టీలో చేరి కష్టపడి జెండా మోసే క్యాడర్‌కే మోసం జరుగుతోందంటే ఇక ప్రజలకు ఆ పార్టీ ఎలాంటి మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రాజకీయ పార్టీల్లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు. కానీ జనసేన పార్టీలో అదంతా కుదరదు అంటూ నామినేటెడ్ పదవి కోసం డబ్బులు సమర్పించుకోవాలట. సరే ఏదో బాధ పడి అప్పుజేసి మరీ డబ్బులిచ్చుకున్నా.. పదవి రావడం లేదట. దీంతో పార్టీ క్యాడర్ మోసపోవాల్సి వస్తుంది. విజయనగరం జిల్లా జనసేన పార్టీలో ప్రస్తుతం అదే జరుగుతోందని చెప్పడానికి సాక్షాత్తు ఆ పార్టీ జిల్లా ప్రచార కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగుజూసిన ఈ ఫిర్యాదు వీడియోలు, ఫిర్యాదు పత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
నామినేటెడ్ పదవి కోసం రూ.12 లక్షలు
గాజు గ్లాస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి చీపురుపల్లికి చెందిన విద్యావంతుడైన కోట్ల కృష్ణ తన ఉద్యోగాన్ని సైతం వదులుకుని పని చేస్తున్నాడు. అయితే ఆయనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ రూ.10 లక్షలు నగదు, రూ.2 లక్షలు చెక్‌ను తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, ఆమె అనుచరుల ద్వారా తీసుకున్నట్టు కోట్ల కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు
జనసేన కేంద్ర కార్యాలయంలో పేరు సిద్ధంగా ఉందని రూ.12 లక్షలు ఇస్తే అపాయింట్మెంట్ లెటర్ వస్తుందని జనసేన జిల్లా ప్రచార కోఆర్డినేటర్ కోట్ల కృష్ణను నమ్మించి జూలై 15, 2025న తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని అనుచరులు సారిక మురళి, మోపాడ అనిల్, రామతోట రాజేష్ తన వద్ద రూ.10 లక్షలు నగదు, రూ.2 లక్షలు చెక్ తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే డబ్బులు మేడం గారికి చేరినట్లు పాలవలస యశస్విని పీఏ మీసాల శ్రీకాంత్ తనకు ఫోన్‌లో ధ్రువీకరించాడని ఫిర్యాదులో వివరించారు.
రచ్చ కెక్కిన గ్లాసు పార్టీ
నామినేటెడ్ పదవుల కోసం ఇష్టారాజ్యంగా సొంత క్యాడర్ నుంచే రూ.లక్షల్లో వసూళ్ల దందాకు తెర తీయడంపై జిల్లాలో గ్లాసు పార్టీ రచ్చ కెక్కింది. తాజాగా ఈ అంశం జిల్లాలోని అన్ని సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తోంది. రాత్రింబవళ్లు పార్టీ కోసం పని చేసే క్యాడర్‌కు సొంత పార్టీలోని మోసం జరుగుతుంటే ఇక ఈ పార్టీను నమ్ముకుని ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయమై సీఐ శంకరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, ఎస్‌ఐకు ఫిర్యాదు కాపీని ఇవ్వాలని చెప్పినట్టు తెలిపారు.
పదవుల పేరిట భారీగా వసూళ్లు
డబ్బులిచ్చి మోసపోయిన క్యాడర్
విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు
రచ్చకెక్కిన గ్లాసు పార్టీ
నామినేటెడ్ పదవి కోసం
రూ.12 లక్షలు లంచం
పదవి ఇస్తానంటూ లంచం కాజేసిన తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్,
అనుచరులు


