విజయనగరం ఫోర్ట్: ఐదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పోలియో చుక్కల మందు వేయించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలో 1180 పల్స్ పోలియో బూత్‌లను, 21 ట్రాన్సిట్ బృందాలను, 66 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
సత్య కళాశాలలో పూల్ క్యాంపస్ డ్రైవ్ రేపు
విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 29న భారీ పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘అజికో బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సహకారంతో ఈ నియామకాలు జరగనున్నాయి. డ్రైవ్‌కు యువతీ యువకులు హాజరు కావచ్చనని, ఎంపికైన అభ్యర్థులకు సంస్థ తరఫున ఉచిత క్యాంటీన్, రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 2025, 2026 సంవత్సరాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొడక్షన్ డిపార్టుమెంట్ పోస్టులకు అర్హులని తెలిపారు. క్లీన్ రూమ్ ఆపరేటర్స్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చునని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ పూల్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అర్హులైన అభ్యర్థులకు కంపెనీ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూం, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి నేరుగా హాజరు కావాలని సూచించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 9063603888 నంబరును సంప్రదించాలని సూచించారు.
ఓపీ కోసం బీపీ వచ్చేలా...
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ చీటీ కోసం రోగులు నిరీక్షించి బీపీ వచ్చేలా పరిస్థితి నెలకొంది. గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతున్నారు. ఓపీ కౌంటర్లలో సిబ్బంది కొరతతో పాటు ప్రింటర్లు కొరత వల్ల రోగులకు సకాలంలో ఈ చీటీలు అందని పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆస్పత్రిలో ఓపీ నిర్వహిస్తారు. అయితే ఓపీ చీటీ కోసం రోగులు కనీసం రెండు మూడు గంటలు ఉండాల్సి రావడంతో వైద్య సేవలు మరింత ఆలస్యంగా అందుతున్నాయి. ఆస్పత్రిలో ఆరు ఓపీ కౌంటర్లు ఉన్నా సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ఒకటి రెండు కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వయో వృద్ధుల కౌంటర్ సిబ్బంది లేక మూసి వేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని, నాలుగైదు రోజుల్లో సిబ్బంది వస్తారని చెప్పారు. దీంతో ఓపీ కౌంటర్లలో ఇబ్బందులు తీరుతాయని తెలిపారు.


