చికెన్
● పేస్‌మేకర్ కోసం పరితపిస్తున్న ఓ కుటుంబం
● కుమార్తెను కాపాడుకునేందుకు
తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
● దాతల కోసం ఎదురుచూపు
వేపాడ: ఆ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా అందులో నలుగురు చిన్నప్పుడే చనిపోయారు. ఉన్న ఒక్క కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు కన్నవారు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. 25 సంవ్సతరాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ చిన్నారిని బతికించుకుంటూ వస్తున్న తల్లిదండ్రులకు తాజాగా మరో కష్టం వచ్చింది. గుండెలో ఓ పరికరం అమర్చాల్సి రావడంతో లక్షలాది రూపాయల అవసరం ఏర్పడింది. దీంతో ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఆ పేద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు, మంగమ్మ దంపతులు గ్రామంలో టీ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. 2001లో వీరికి సాయిలక్ష్మి అనే చిన్నారి పుట్టింది. అంతకుముందు ముగ్గురు బిడ్డలు పుట్టి వెంటనే చనిపోయారు. సాయిలక్ష్మి తర్వాత కూడా ఓ బిడ్డ పుట్టి కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రుల ఆశలన్నీ సాయిలక్ష్మిపైనే ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే వారికి పెద్ద కష్టం వచ్చి పడింది. చిన్నారిని అనారోగ్యం సోకడంతో పలు ఆస్పత్రులకు తిప్పారు. ఈ క్రమంలో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా పాప గుండెకు రంధ్రం ఉందని నిర్ధారించడంతో అక్కడ నుంచి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 2005లో చిన్నారికి కేర్ ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో 2006లో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు సాయిలక్ష్మికి పేస్‌మేకర్ పరికరం అమర్చాలని సూచించారు. అయితే ఆర్థికంగా అంత స్థోమత లేని తల్లిదండ్రులు దాతల సహాయంతో సుమారు రూ. 2.25 లక్షలు సేకరించి 2007లో చిన్నారికి హైదరాబాద్ కేర్‌లో పేస్‌మేకర్ అమర్చారు.
మరోసారి ప్రాణాపాయం..
పేస్‌మేకర్ అమర్చిన తర్వాత కొద్దికాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి 2010లో మళ్లీ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆస్పత్రి వైద్యులు 30 రోజుల్లో పేస్‌మేకర్ మార్చాలనడంతో అప్పట్లో బాధిత తల్లిదండ్రులు సాక్షిని ఆశ్రయించారు. సాక్షి టీవీ, సాక్షి పత్రికల్లో వచ్చిన కథనాలకు దాతలు స్పందించి సహకరించడంతో సాయిలక్ష్మికి పేస్‌మేకర్ మార్చారు. దీంతో చిన్నారి చక్కగా చదువు కొనసాగించి, ప్రస్తుతం చినముషిడివాడలో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది.
2016లో పేస్‌మేకర్ మార్పు..
సాయిలక్ష్మికి 2007, 2010, 2016 సంవత్సరాల్లో దాతలు, ఆరోగ్యశ్రీ సహకారంతో హైదారాబాద్‌లో సింగిల్ నీడ్ పేస్‌మేకర్ అమర్చినట్లు సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అయితే 2024లో విశాఖలో మెడికవర్ ఆస్పత్రిలో డబుల్ నీడ్ పేస్‌మేకర్ అమర్చగా.. ఎనిమిదేళ్లు పనిచేయాల్సిన పేస్‌మేకర్ పనితీరు సాంకేతిక లోపంతో మందగించింది. దీంతో ఈ ఏడాది జూన్ 17న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి సాయిలక్ష్మిని తీసుకెళ్లగా ఆరు నెలల్లో లీడ్‌లెస్ పేస్‌మేకర్ ఏర్పాటు చేయాలని.. ఇందుకు రూ.పది లక్షలు అవసరమవుతుందని తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సంప్రదించాల్సిన నంబర్


