జాగ్రత్తలే శ్రీరామరక్ష.. | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలే శ్రీరామరక్ష..

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

జాగ్రత్తలే శ్రీరామరక్ష..

వర్షాకాలంలో మూగజీవాలకు

పొంచి ఉన్న ముప్పు

వ్యాధి నిరోధక టీకాలు వేయాలి :

పశు వైద్యాధికారులు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

● వర్షాకాలంలో పశువులు, మేకలు, గొర్రెలను పాకల్లోనే ఉంచాలి.

● బురద, చిత్తడి నేలల్లో తిరగకుండా చూడాలి.

● పరిశుభ్రమైన నీరు తాగించాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలి.

● లేగ దూడలను వ్యాధి ప్రబలిన పశువులకు దూరంగా ఉంచాలి.

● మేత, దాణా తగు మోతాదులో ఇవ్వాలి.

● ఎటువంటి వ్యాధి లక్షణాలున్నా వెంటనే సంబంధిత పశువైద్యాధికారిని సంప్రదించి నివారణకు తగు చర్యలు తీసుకోవాలి.

● ముందు జాగ్రత్తగా పవువులకు యాంటీ బయాటిక్స్‌ టీకాలు వేయించాలి.

సీతంపేట: వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈదురుగాలులు, వర్షాలకు పశువులు నీరసించిపోతాయి. జోరీగలు, దోమల వల్ల గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, తదితర వ్యాధుల బారిన పడతాయి. కేవలం ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే పశువులను, జీవాలను రక్షించుకోవచ్చని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పాడి సంపదను కోల్పోక తప్పదు. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి పశువైద్యులను సంప్రదించడం ద్వారా పశువులు, జీవాలను సంరక్షించుకోవచ్చు.

చిటుక వ్యాధి..

దీన్ని యాంటీ రోటాక్సిమియా అని కూడా అంటారు. ఇది క్లాస్ట్రీడియం అనే సూక్ష్మక్రిమి వల్ల వ్యాపిస్తుంది. తొలకరి చినుకులు పడిన తర్వాత వచ్చిన పచ్చికను గొర్రెలు, మేకలు మేసినప్పుడు గడ్డితో పాటు ఈ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు వాటి కడుపులోనికి ప్రవేశించి కొన్ని విష పదార్థాలను విసర్జించడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. వ్యాధి సోకిన గొర్రెలు చెంగున ఎగిరి హఠాత్తుగా మరణిస్తాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నపుడు గొర్రెలు పలుచగా పారుకోవడం, కాళ్లు బిగిసి నడవడం, ఫిట్స్‌ వచ్చినట్టు పడిపోవడం, తల వెనుకకు లాగుతూ కనిపిస్తాయి. ఆ తర్వాత ఊపిరాడక అవి మరణిస్తాయి.

వ్యాధి నివారణకు ..

నాలుగు నెలలు పైబడిన గొర్రె పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో చిటుక రోగ నిరోధక టీకాలు వేయించాలి. ఈ టీకాలు వేసే సమయానికి నెల రోజులు ముందుగా విధిగా గొర్రెలన్నింటికి నట్టలు, బద్దె పురుగు నివారణ మందులు తాగించాలి. టీకాలు వేసిన గొర్రెలకు ఒక సంవత్సరం వరకు ఈ వ్యాధి రాదు. ఈ టీకా ప్రతి పశువైద్యశాలలో ఉచితంగా లభిస్తుంది.

పీపీర్‌ వ్యాధి..

వైరస్‌ వల్ల గొర్రెలు, మేకల్లో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువులు 90 శాతం వరకు మృత్యువాత పడతాయి. వ్యాధి సోకిన గొర్రెల్లో 106 డిగ్రీల జ్వరం వస్తుంది. ముక్కు నుంచి నీరు కారడం, నోటిలో పుండ్లు ఏర్పడడం గమనించవచ్చు. దుర్గంధంతో కూడిన విరేచనాలు కలుగుతాయి. పశువు ఆహారం తీసుకోక మృతి చెందుతుంది. నివారణకు పీపీఆర్‌ టీకా మందును ముందస్తుగా వేయించినట్లయితే వ్యాధి రాకుండా నివారించవచ్చు.

వర్షంలో తడవనీయరాదు..

పశువులను వర్షంలో తడవనీయకూడదు. అలాగే పిడుగులు పడే సమయాల్లో కూడా పశువులను శాలల్లోనే ఉంచాలి. మేతకు తీసుకెళ్లే సమయంలో తుప్పలు, డొంకల దగ్గర పురుగులు, విషసర్పాలు లేకుండా చూసుకోవాలి. పశువు ల ఆస్పత్రుల్లో లభించే వ్యాధి నిరోధక టీకాలు ముందస్తుగా వే యించాలి. – శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ ఎ.డి, సీతంపేట

గొంతువాపు వ్యాధి..

వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రధానమైనది. దీన్నే గురక వ్యాధి అని అంటారు. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు, మెడ వాస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

చికిత్స: సల్ఫాడిపోజిన్‌ ఇంజిక్షన్‌ బాగా పనిచేస్తుంది.

నివారణ: ప్రతి ఏడాదీ తొలకరిలోనే ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement