బొబ్బిలి రూరల్: నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి కారాడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయగడ సమీపంలోని చిన్న అసిరి గ్రామానికి చెందిన సుబరి బంధు, రాజకుమారి దంపతులు కారాడ గ్రామ సమీపంలోని పామాయిల్ తోటలో పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. బంధు, రాజకుమారి తోటలో గల ఇంటి వద్ద ఫ్యాన్ బాగు చేసుకుంటుండగా.. చిన్నకుమార్త మానస ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి డ్రమ్ములో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి గురించి వెతికిన తల్లిదండ్రులకు నీటి డ్రమ్ములో కనిపించింది. వెంటనే చిన్నారిని బొబ్బిలి సీహెచ్‌సీ తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


