జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,847 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా... అధికారులు ఇప్పటి వరు 15,63,394 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, రికార్డు స్థాయిలో 99.01 శాతం పూర్తి చేశారు. అయితే, సేకరించిన ఫారాలను కంప్యూటర్లలో నమోదుచేసే ప్రక్రియలో యంత్రాంగం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 1,73,759 ఫారాలు మాత్రమే ఆన్‌లైన్ అయ్యాయి. అంటే దాదాపు 14 లక్షల మంది ఓటర్ల డేటా ఇంకా కార్యాలయాల్లోని ఫైళ్లలోనే మగ్గుతోంది.
పంపిణీ‘భేష్’...
డిజిటలైజేషన్ ‘ఫ్లాప్’
విజయనగరం అర్బన్:
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్–2026) క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేయడంలో చూపిన ఉత్సాహం... వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు (డిజిటలైజేషన్) చేయడంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా విస్మరించారు. గురువారం సాయంత్రం వరకు అందిన అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఫారాలు సేకరించి కార్యాలయాల్లో మూలపడేసినా... వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ మాత్రం దారుణంగా వెనుకబడి కేవలం 11 శాతానికే పరిమితమైంది. ఇదే అలసత్వం కొనసాగితే రాబోయే ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా కేంద్రంలోనే ఘోర వైఫల్యం
అధికారుల కళ్లెదుటే ఉంటే విజయనగరం నియోజకవర్గంలోనే డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,61,300 మంది ఓటర్లు ఉండగా 2,51,492 ఫారాలను పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ కేవలం 4.70 శాతంతో 12,270 ఫారాలు మాత్రమే పూర్తయింది. జిల్లాలోనే ఇది అత్యల్పం. పట్టణ సరిహద్దులోనే ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా ఆందోళనకరంగా ఉంది. 2,13,904 ఫారాలు పంపిణీ జరిగితే... అన్‌లైన్ నమోదు కేవలం 6.02 శాతం మాత్రమే కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గజపతినగరం నియోజకవర్గంలో 99.97 శాతం పంపిణీ జరిగినా... డిజిటలైజేషన్ కేవలం 8.59 శాతం వద్దే నిలిచిపోయింది.
ఓటర్లలో రేకెత్తుతున్న అనుమానాలు
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో టాప్ పొజిషన్‌లో ఉన్న రాజాం నియోజవర్గంలో కూడా కేలవలం 17.45 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వేల పేరుతో సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సకాలంలో నమోదు చేయకపోకతే, అర్హులైన ఓటర్ల పేర్లు, ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి కేవలం ఫారాల పంపిణీ టార్గెట్లకే పరిమితం కాకుండా ... ప్రత్యేక సిబ్బందిని (డేటా ఎంట్రీ ఆపరేటర్లను) నియమించి యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్న వాదన వినిపిస్తోంది. లేనిపక్షంలో సామాన్య ఓటరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకుల ఆందోళన పడుతున్నారు.
జిల్లాలో వెనుకబడిన ఎన్యూమరేషన్ ఫారాల ఆన్‌లైన్ నమోదు
పంపిణీ 99 శాతమైనా..
కంప్యూటరీకరణ కేవలం 11 శాతమే
చిట్టచివరి స్థానంలో జిల్లా కేంద్రం
విజయనగరం 4.7 శాతం
అధికారుల పర్యవేక్షణా లోపంపై సర్వత్రా విమర్శలు


