● మంత్రి గారూ..
సాలూరు: ‘మీ ఉద్యోగాలు తొలగించం.. అందరి ఉద్యోగాలు ఉంటాయి.. డీఎస్సీ–2025 వల్ల గిరిజన గురుకుల పాఠశాలల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదంటూ హామీ ఇచ్చారు... తీరా కొత్తవారిని నియమించారు.. పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా తమ ఉద్యోగాల కొనసాగింపునకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వలేదు’... దీనికి సమా ధానం చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సాలూరులోని గిరిజన, సీ్త్ర సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటిముందు శుక్రవారం ఆందోళన చేశారు. అక్కడే బైఠాయించి న్యాయం చేయాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ప్రాణాలైనా విడుస్తామని, ఉద్యోగాలను వదలుకోలేమని స్పష్టంచేశారు. గిరిజన గురుకులాల్లో 15 ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని ఉన్నఫళంగా రోడ్డున పడేయడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త ఉద్యోగాలు కల్పించకుండా, ఉన్న ఉద్యోగాలు తొలగించడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంటివద్దకు టీచర్లు ఒక్కొక్కరుగా చేరుకుని ఆందోళనకు దిగడంతో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులు నిర్వహించారు.
ఎండలోనే గురువుల నిరసన..
మంత్రి ఇంటిముందు గంటల తరబడి ఉపాధ్యాయులు ఎండలోనే నిరసన కొనసాగించారు. టీచర్లు ఆందోళన విరమించకపోవడంతో మంత్రి సంధ్యారాణి దిగివచ్చారు. తన ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఉపాధ్యాయుల నుంచి ఒక్కసారి ప్రశ్నల వర్షం కురవడంతో అసహనం వ్యక్తంచేస్తూ ఇంటిలోకి వెళ్లిపోయారు. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేసే క్రమంలో... ఘటన పెద్దదవుతుందన్న ఉద్దేశంతో మంత్రి మళ్లీ ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడారు. సుమారు 216 మందికి నాన్ టీచింగ్‌లో సర్దుబాటు చేస్తున్నామని, మిగిలిన వారి కోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫైల్ పెట్టామని, ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1456 మందికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరారు. మంత్రి హామీ అమలుకు కొద్దిరోజులు సమయం ఇస్తామని, లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ నాయకులు స్పష్టంచేస్తూ ఆందోళన విరమించారు.
మంత్రి సంధ్యారాణి ఇంటి ముందు గురుకుల అవుట్‌సోర్సింగ్ టీచర్ల ధర్నా
ఉద్యోగాలు తొలగించమన్న హామీని నిలబెట్టుకోవాలంటూ నినాదాలు
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్


