విజయనగరం అర్బన్:
జిల్లాలో అవినీతి ‘దిశ’గా పాలన సాగుతోందని, ఉపాధిహామీ నిధుల కై ంకర్యం పెద్ద ఎత్తున జరుగుతున్నా చర్యలు లేవని, అవినీతి పరులకు పాలకులే రక్షణ కవచంగా నిలుస్తున్నారంటూ పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన ‘దిశ’ సమీక్షా సమవేశం కూటమి నాయకుల దాటవేత ధోరణికి, అవినీతి సంరక్షణకు వేదికగా మారడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన దిశ సమీక్ష సమావేశంలో కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను మింగేస్తున్న అవినీతి తిమింగలాలకు సాక్షాత్తు అధికార పక్ష పెద్దలే రక్షణ కవచంగా నిలుస్తున్నారన్న దానికి సమావేశం సజీవ సాక్ష్యంగా నిలిచింది. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆధారాలతో సహా అవినీతిని బట్టబయలు చేసినా.. ఎంపీ కనీసం బాధ్యతగా సమా ధానం చెప్పలేక చేతులెత్తేయడం గమనార్హం.
విజయనగరం మండల పరిధిలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన రూ.41.80 లక్షల భారీ అక్రమాలను విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు దిశ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ నిధుల లూటీకి ఎంపీడీఓ ప్రధాన కారకుడని విచారణలో సైతం రుజువైందన్నారు. ఈ అవినీతి వ్యవహారం శాసన మండలిలో ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజు ప్రస్తావించినప్పుడు స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ఆరు మాసాలు గడుస్తున్నా.. సదరు అవినీతి ఎంపీడీఓపై చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఎంపీపీ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రణాళిక రూపకల్పనలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను విస్మరిస్తున్నారన్నారు. దీనిపై ఎంపీ సమాధానం చెప్పలేక ‘ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీ మండల పరిషత్ సమావేశంలో చూసుకోండి’ అంటూ దాటవేశారు. అవినీతిపై చర్యలు తీసుకోమంటే మండల స్థాయికి నెట్టేయడం చూస్తుంటే... తప్పు చేసిన అధికారులను కాపాడటానికే ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారా? అంటూ పలువురు సభ్యులు గుసగుసలాడారు. సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పి.సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం ఆదేశాలకే దిక్కులేదు
సభ దృష్టికి జరజాపుపేట తాగునీటి సమస్య
ఉపాధి హామీలో రూ.41.80 లక్షల స్వాహాపై ఎంపీపీ ధ్వజం
అవినీతి ఎంపీడీఓపై చర్యలెందుకు
తీసుకోలేదని నిలదీత
మండలంలో చూసుకోమంటూ ఎంపీ కలిశెట్టి దాటవేత
కేంద్ర పథకాల సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధుల మాటకు దక్కని గౌరవం


