వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు సమీపంలో కొట్టిశ చేపల రేవు వద్ద రేకుల షెడ్డు కూలి బుధవారం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎనిమిది మంది కొట్టిశ గ్రామస్తులు కాగా, ఒకరు లక్ష్మీపేట గ్రామానికి చెందిన రైతు. కొట్టిశ సమీపంలో ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టులో ఏడుగురు మత్స్యకారులు చేపలు వేట చేయడానికి పడవల సహాయంతో వలలు వేసి తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. వారిలో కొట్టిశ గ్రామానికి చెందిన మత్స్యకారులు చేడిగ రామన్నదొర, యందవ సింహాచలం, కుప్పిలి వెంకయ్య, కుప్పిలి అప్పయ్య, పత్తిగూడ రాంబాబు, గంటా గౌరు, కల్లూరు సూర్యనారాయణతో పాటు సమీప పంట పొలాల్లో పశువులు మేతకు తీసుకువెళ్లిన రైతులు కొట్టిశ గ్రామానికి చెందిన రాము, లక్ష్మీపేట గ్రామానికి చెందిన కొనిశ తిరుపతిలు ఒకే ప్రదేశంలో ఉన్నారు. ఇంతలో భారీ గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులతోపాటు రైతులు మొత్తం తొమ్మిది మంది రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. ఇంతలో భారీ వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించగా వారు తలదాచుకున్న రేకుల షెడ్డు సుమారు 50 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఈ తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరో మత్స్యకారుడు ఉత్తరావెల్లి చిన్నంనాయుడు, పలువురు మత్స్యకారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డోలీల సహాయంతో క్షతగాత్రులను గ్రామ సమీపంలోకి తీసుకువచ్చారు. జరిగిన సంఘటన వివరాలను స్థానిక ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీకి వివరించారు. 108 వాహనాలకు సమాచారం అందించారు. హుటాహుటిన వంగర పీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో రాజాం సీహెచ్‌సీకి తొమ్మిది మందిని తరలించి వైద్యసేవలందిస్తున్నారు. రాజాం సీహెచ్‌సీకి వంగర ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ వెళ్లి, వైఎసా్‌స్‌ర్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ తలే రాజేష్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
కొట్టిశ చేపల రేవు వద్ద ఘటన


