● ఏఐఎస్‌ఎఫ్ వినతి
విజయనగరం గంటస్తంభం: సుదూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.చరణ్ తేజ ఆధ్వర్యంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్రకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బస్సుల్లో రద్దీ కారణంగా సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నామన్నారు. గజపతినగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, పద్మనాభం తదితర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. బస్సులు వేయకుంటే ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో రాము, గణేష్, ప్రకాష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాక్సింగ్ జట్టుకు సహకారం అందించండి
శృంగవరపుకోట: బాక్సింగ్ క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్న జిల్లా జట్టుకు తగిన ప్రోత్సాహం అందించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణిని విజయనగరం జిల్లా బాక్సింగ్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి ఇందుకూరి అశోక్‌రాజు కోరారు. ఎస్.కోట మండలం భవానీనగర్ వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో శాప్ ఎం.డి భరణిని మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్‌రాజు మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ విజయాలు సాధిస్తున్నారని వివరించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక శిక్షణ అవకాశాలు, తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, బ్యాడ్మింటన్ కోచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ చెస్ పోటీల్లో జ్వాలాముఖి ప్రతిభ
విజయనగరం: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో విజయనగరానికి చెందిన కేవీ.జ్వాలాముఖి తన ప్రతిభతో సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని సరోవర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డేనిస్ ఇంటర్నేషనల్ ఫీడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్‌లో పీహెచ్‌సీ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన జ్వాలాముఖి ద్వితీయ బహుమతి సాధించి రూ.6000 నగదుతో పాటు ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో అమెరికా, స్వీడన్, జపాన్ , భారతదేశం నుంచి 680 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం దక్కించుకున్న జ్వాలాముఖిని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే.జగన్నాఽథం, కార్యదర్శి ప్రసాద్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ చెస్ క్రీడాకారులు అభినందించారు. మరిన్ని బహుమతులు సాధంచాలని ఆకాంక్షించారు.


