వైభవంగా పైడితల్లి ఆలయ పునఃప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పైడితల్లి ఆలయ పునఃప్రారంభోత్సవం

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

విజయనగరం టౌన్‌: మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ పైడితల్లి అమ్మవారి చదురుగుడి పునఃప్రారంభోత్సవాలు మంగళవారం వైభవంగా ఆరంభమయ్యాయి. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం వేదపండితులు స్వస్థివాచకములతో యాగశాల ప్రదక్షణ, పంచభూతములకు బలిహరణ, యాగశాల ప్రవేశం, పరిషత్‌, ప్రతిష్టా సంకల్పం, విఘ్నేశ్వరపూజ పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసనలు, రుత్విక్‌ వరుణలు జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిగజపతిరాజు పాల్గొని కంకణధారణ చేసి, అమ్మవారికి ప్రత్యేకపూజాధికాలను నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు చేసి పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి వేదపండితులు మత్సంగ్రహణ, అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, ఆవరణ హోమం, సింహహోమం, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి, భేరీపూజలు, నీరాజన మంత్రపుష్పాలను సమర్పించారు. అనంతరం ఈఓ శిరీషా మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే ఆలయ ప్రారంభోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. 25న ఆలయ శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ ధర్మకర్తలు కె.టి.రావు, ఆనందరావు, స్వాతి, కుమారి, పద్మావతి, వెంకటలక్ష్మి, గోపాలరెడ్డి, కృష్ణమూర్తిరాజు, వై.వి.రమణ, రామయ్య పంతులు, తులసి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement