మ్యుటేషన్లలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

మ్యుటేషన్లలో అలసత్వం వద్దు

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

జేసీ సేతుమాధవన్‌

విజయనగరం అర్బన్‌: భూ రికార్డుల మార్పులు, వారసత్వ బదిలీలు, కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన మ్యుటేషన్‌ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపొద్దని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ అధికారులను అదేశించారు. రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన పట్టాదారు పాస్‌ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును నిర్ణీత కాలవ్యవధిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన వాటిని వెంటనే పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఖాతాలకు డిజిటల్‌ సంతకాలను త్వరితగతిన పూర్తిచేసి, పాస్‌ పుస్తకాల జనరేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘గుడ్‌ ఫర్‌ ప్రింటింగ్‌’ దశకు చేరుకున్న పాస్‌ పుస్తకాలను సిద్ధంచేసి, వచ్చే జూలై నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేసీ స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో రికార్డుల ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్‌, సుధారాణి, సర్వే ఏడీ విజయకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement