తాత ఒడి నుంచి మృత్యుకౌగిలికి... | - | Sakshi
Sakshi News home page

తాత ఒడి నుంచి మృత్యుకౌగిలికి...

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

పూసపాటిరేగ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శ్రీకాకుళం జిల్లా కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో సంతోషంగా బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లులో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్‌ చేస్తుండడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. ఏమైందో తెలియదు... భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్‌పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి ఇంటికి అల్లుడు రాపాక కిశోర్‌కుమార్‌, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్‌ రిహాన్‌సుహాసన్‌ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన కొయ్యనేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయలుదేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న కిశోర్‌కుమార్‌ ఇంటికి చేరుకుని అక్కడ కాసేపు సేదతీరాక రాజమండ్రి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. మరో అరగంటలో ఇంటికి చేరుకుందామన్న సమయంలో పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్‌రిహాసుహాసన్‌ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు.

హాహాకారాలు...

కారును లారీ ఈడ్చుకుపోయే సమయంలో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో మృత్యుఘోష వినిపించింది. స్థానికులు పరుగున వచ్చేసరికి ప్రమాదం జరిగిపోయింది. కారులో ఇరుక్కున్న రాపాక కిశోర్‌కుమార్‌ను బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు శ్రమించారు. గ్యాస్‌ కట్టర్‌తో ఇనుపరాడ్లను కట్‌చేశారు. గాయపడిన వారిని సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. రోడ్డు మధ్య ఇరుక్కున కారును క్రేన్‌ సహాయంతో సీఐ కూన దుర్గాప్రసాదు, ఎస్‌ఐ వావిలాల పాపారావులు పక్కకు తీయించారు. అప్పటివరకు వాహనాలను సర్వీస్‌రోడ్డులోకి మళ్లించారు. సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

మృత్యుమార్గం

పోలిపల్లి వద్ద ఉన్న ఫ్లై ఓవర్‌ మృత్యుమార్గంగా మారింది. వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల అదే ప్రదేశంలో జరిగిన నాలుగు ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడగా 10 మంది వరకు క్షతగాత్రులుగా మిగిలారు. పోలిపల్లి ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరగడంతో డిజైన్‌లో లోపం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైవే అధికారులు రహదారిని పరిశీలించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోలిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పిన కారు

డివైడర్‌ను దాటి వెళ్లడంతో ఢీకొన్న లారీ

ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు

కారులో ఇరుక్కుపోయిన వారిని

బయటకు తీసిన పోలీసులు

రోడ్డు ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న తాత, మనవడు మరణించారు. అప్పటివరకు వెనుక సీటులో ఉన్న మనవడు సాత్విక్‌ రిహాన్‌సుహాసన్‌ తాతవద్దకు వెళ్తానంటూ మారాం చేశాడు. దీంతో తల్లి ఉమామహేశ్వరి తండ్రి సూరిబాబుకు సాత్విక్‌ను అందించింది. కాసేపటికే ప్రమాదం జరగడం, మృత్యు ఒడికి చేరడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వెనుక సీటులో ఉన్న సూరిబాబు భార్య, కుమార్తె, మరో మనుమరాలు గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement