సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.594 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.594 కోట్లు

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

కొత్తవలస: జిల్లాలోని పొదుపుసంఘాల్లో ఉన్న 61వేల మంది మహిళలకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.594 కోట్లు రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని సీ్త్ర నిధి ఏజీఎం బి.సత్యనారాయణ తెలిపారు. కొత్తవలస వెలుగు కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 8,400 మహిళలకు రూ.82 కోట్ల రుణం మంజూరు చేశామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.283 కోట్లు రుణాలు అందజేయగా 99.96 శాతం రికవరీ అయ్యిందన్నారు. జిల్లాలోని 10 సంఘాల్లోని మహిళలు సుమారు రూ.48లక్షల రుణాన్ని సక్రమంగా చెల్లించలేదన్నారు. ఏ గ్రేడ్‌ సంఘానికి రూ.కోటీ80లక్షలు, బి–గ్రేడ్‌కు రూ.కోటీ30 లక్షలు, సీ–గ్రేడ్‌కు రూ.కోటి, డీ గ్రేడ్‌ సంఘానికి రూ.70 లక్షల వరకు రుణ పరపతిని పెంచామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఎ.వెంకటరమణ, సీసీలు అప్పలనాయుడు, అప్పలస్వామి పాల్గొన్నారు.

నవధాన్యాలతో నేల సారవంతం

డెంకాడ: నవధాన్యాలు విత్తిన 30 నుంచి 40 రోజుల తర్వాత నేలలో కలియదున్నడం వల్ల భూ సారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు తెలిపారు. సింగవరం గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, పంట మార్పిడిపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు వరి సాగును తగ్గించి చిరుధాన్యాల సాగును పెంచాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ రసాయన ఎరువు ఏపీఐఎంఎస్‌ యాప్‌ ద్వారా మాత్రమే రైతులకు అందిస్తామని తెలిపారు. పంట పొలాల గట్లపై వేయడానికి వంద శాతం రాయితీపై కంది విత్తనాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రశేఖరరావు, ఏఓ సంగీత, ఏఈఓ బి.రామకోటి, ఏఏఓ జయలక్ష్మి పాల్గొన్నారు.

కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

రేగిడి: రాష్ట్రంలో కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు బకాయిపెట్టిన రూ.9వేల కోట్లు నిధులు విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కాపునేస్తం సహా ఎన్నో పథకాలను కాపులకు అందించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకు వస్తారని విమర్శించారు. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా!, అధికార పార్టీనేతల అరాచకాలు చంద్రబాబు కళ్లకు కనిపించడంలేదన్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, కింజరాపు సురేష్‌, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, ఎర్నేన అప్పలనాయుడు, బాలి తవిటినాయుడు, బెవర అనంతనాయుడు పాల్గొన్నారు.

అలసత్వం వద్దు

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాసేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే క్షేత్రస్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఎస్‌.సేతుమాధవన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎఫ్‌ లైన్‌ సర్వే, మ్యుటేషన్‌, రేషన్‌ పంపిణీ, ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఫలితాల్లో వెనుకబడిన అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రజల నుంచి సానుకూల స్పందన తక్కువగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement