● ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే
కొనసాగించాలి
● కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆందోళన
విజయనగరం: ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి గణేష్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పేదవాని వాహనం ఆర్టీసీని నిర్వీర్యం చేయోద్దంటూ నినదించారు. అనంతరం కలెక్టర్ రాంసుందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌లు మాట్లాడుతూ ఓవైపు ప్రజలను, మరో వైపు ఆర్టీసీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసేలా ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలతో ఇప్పటికే జిల్లాలో ఎన్నో పరిశ్రమలు మూతపడి ఉపాధి అవకాశాలు కుంటుపడుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యతో పాటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడంతో వెనుకబడిన విజయనగరం జిల్లా ప్రజల ఇబ్బందులు మళ్లీ మొదటికొస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


