చీపురుపల్లిరూరల్: పట్టణంలోని ఎస్‌వీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో విజయనగరం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెపెక్స్‌ట్రిమ్ జిమ్ నిర్వహణలో రెండు జిల్లాల స్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీలు ఘనంగా సోమవారం ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు మాట్లాడుతూ చీపురుపల్లిలో ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని జిల్లా,రాష్ట్రస్థాయి,జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకుడు ప్రసాద్, అసోషియేషన్‌సభ్యులు, క్రీడాకారులు, నాయకులు మీసాల బాలు,గవిడి సురేష్,కర్రోతు ప్రసాద్,సాయి తదితరులు పాల్గొన్నారు.
40 లీటర్ల సారా స్వాధీనం
● ముగ్గురిపై కేసు నమోదు
కురుపాం: కురుపాం పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం నిఘా పెట్టి మీసాల శ్రీకాంత్ అనే నిందితుడిని మూలిగూడ జంక్షన్ వద్ద 40 లీటర్ల సారా, ఒక ద్విచక్రవాహనంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా అక్రమంగా సారా తరలింపులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు వెలగాడ చిన్నరాయుడు, మీసాల దిలీప్‌లను గుర్తించి అరెస్టు చేసి ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. మద్యం అక్రమ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏఎస్సై రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వే ట్రాక్‌పై మృతదేహం
సీతానగరం/బొబ్బిలి: సీతానగరం–బొబ్బిలి రైల్వే లైన్‌లో సోమవారం సాయంత్రం గుర్తు తెలి యని వ్యక్తి(40) మృతదేహం లభ్యమైందని జీ ఆర్పీ ఎస్సై వి.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు.మృతుడి శరీరంపై ఎరుపురంగు చారలు కలిగిన షర్టు, కాఫీరంగు ఫ్యాంట్, సిమెంట్ రంగు నిక్కరు, నలుపురంగు బూట్లు ఏదైనా కంపెనీలో చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా గుర్తుపట్టినట్లయితే రైల్వే ఎస్సై వి.బాలాజీ రావు, వియనగరం ఫోన్ 9247585742నంబర్ లేదా జీఆర్పీ హెచ్‌సీ సెల్ 8309901038 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
కొత్తవలసలో గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: కొత్త వలస రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ సోమవారంతెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద ఎలక్ట్రికల్ పోల్ పక్కనే మృతదేహాన్ని గుర్తించామన్నారు. 5.6 అంగుళుల పొడవు, చామన ఛాయ రంగు, కుడి చేతిపై ప్రసాద్, మాయ, ఎస్పీజే అనే ఆంగ్ల అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. శరీరంపై నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, వైలెట్ కలర్ గల లోయర్ ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని గుర్తించిన వారు ఫోన్9247585742, 9440170317 నంబర్లను సంప్రదించాలని జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రపాద్ కోరారు.


