చర్యలు తప్పవు..
● సర్వజన ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో రూ.వేలల్లో అక్రమ వసూళ్లు! ● ఆరోగ్యశ్రీ వర్తించినా.. వసూళ్లుకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ● విస్తుపోతున్న రోగులు
రామతీర్థంలో యోగా సాధనలో ఆలయ ఈఓ, అర్చకులు, భక్తులు
విజయనగరం ఫోర్ట్:
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో గతానికి భిన్నంగా పైసలు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రోగులను వార్డుకు తరలించడానికి, వార్డు నుంచి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లేందుకు సిబ్బంది రూ.500 నుంచి వెయ్యి వరకు తీసుకుంటారనే అపవాదు ఎటూ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు ఆర్‌ఎంపీలతో థియేటర్ సిబ్బంది ఒప్పందం కుదుర్చుకుని ఇటీవల కాలంలో రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి.
రూ.వేలల్లో వసూళ్లు..
రోగులకు శస్త్రచికిత్సలు చేయడానికి రూ.వేలల్లో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శస్త్రచికిత్స చేయించినందుకుగాను వేల రూపాయిల్లో అక్రమంగా వసూలు చేస్తున్నట్టు జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ దందా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వైద్యాధికారులకు ఈ విషయం తెలియదా.. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
బోధనాస్పత్రి కావడంతో నిత్యం శస్త్రచికిత్సలు
బోధనాస్పత్రి కావడంతో నిత్యం అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తారు. రోడ్డు ప్రమాదాల్లో కాలు, చేతులు విరిగిన వారికి, చెవి, ముక్కు సమస్యలు ఉన్న వారికి, కడుపునొప్పి, హెర్నియా, మూల వ్యాధి, కడుపులో కణితులు ఉన్న వారికి, తలలో రక్తం గడ్డకట్టిన వారికి, తలలో రక్త స్రావం అయిన వారికి, కిడ్నీ సమస్యలు ఉన్న రోగులకు శస్త్రచికిత్సలు చేస్తారు. సర్వజన ఆస్పత్రిలో ప్రతీ రోజు చిన్న, పెద్ద శస్త్రచికిత్సలు 10 నుంచి 20 వరకు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే ఇక్కడ కూడా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే తదుపరి చికిత్స కోసం వచ్చేటప్పుడు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం మండలానికి చెందిన
ఓ వ్యక్తికి కడుపునొప్పి రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రికి చెందిన ఓ ఉద్యోగి నీకు ప్రైవేటు ఆస్పత్రిలో రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు
అవుతుంది. ఇక్కడ నీకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ బాగా చేయిస్తామని చెప్పారు. అతని వద్ద రూ.వేలల్లో తీసుకుని ఆపరేషన్ చేయించినట్టు తెలిసింది.
ఆపరేషన్ థియేటర్‌లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. సర్వజన ఆస్పత్రిలో అన్ని సేవలు ఉచితంగానే అందిస్తున్నాం. అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు రోగుల నుంచి ఫిర్యాదు వస్తే తీవ్ర చర్యలు తప్పవు.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


