● ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలి ● ఖాళీ బిందెలతో మహిళల నిరసన ● పట్టించుకోని పాలకులు
సంతకవిటి:
బాబూ.. మేము ఇంటింటికి కుళాయిలకు అర్హులం కాదా.. అంటూ ఓ గ్రామస్తులంతా ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మండవకురిటి గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదివారం సాయంత్రం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ గ్రామంలో పాడైపోయిన బావి నుంచి మంచినీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా అందిస్తున్నారని, ఆ బావిలో చెత్త చెదారం నిండి శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీరు తాగడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని మహిళలు మండిపడ్డారు. ‘కావాలి.. కావాలి... ఇంటింటికి కుళాయి కావాలి..’ అని నినదిస్తూ గ్రామంలో భారీ ర్యాలీ చేశారు. రామమందిరం వద్ద రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు స్పందించి తమ గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మా గ్రామంలో ఇంటింటి కుళాయిలు లేకపోవడంతో గ్రామస్తులం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఓ బావి నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. జల్ జీవన్ ద్వారా గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలి.
– కొప్పుశెట్టి శ్రీనివాసరావు, మండవకురిటి
ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో ఉన్న సామూహిక కుళాయిల వద్ద తాగు నీరు ఎప్పుడో వస్తుందో తెలియక నీటి కోసం ఎదురు చూడడంతోనే రోజు ముగుస్తుంది. అధికారులు, పాలకులు స్పందించాలి.
–పడాల జ్యోతి, మండవకురిటి


