కొత్తగా ఒక్కరైతుకు అందని పెట్టుబడి సాయం | - | Sakshi
Sakshi News home page

కొత్తగా ఒక్కరైతుకు అందని పెట్టుబడి సాయం

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

ఫొటోలో కనిపిస్తున్న రైతుపేరు దివిలి శ్రీనివాసరావు. ఇతనిది మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామం. రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క రూపాయికూడా ఇతనికి సాయం అందించలేదు.

ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కరకనాయుడు. ఇతనిది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇతనికి రైతు భరోసా పథకం కింద ఏటా ఠంచన్‌గా ఆర్థిక సాయం అందేది. టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరూపాయి పెట్టుబడి సాయం అందించలేదు.

విజయనగరం ఫోర్ట్‌:

వీరు ఇద్దరు రైతులే కాదు. జిల్లాలో వేలాదిమంది కౌలు రైతులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిది ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం కంటే రైతులకు ఎక్కువ మేలు చేస్తామని గొప్పలు చెప్పారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో ఇచ్చే సాయంతోనే రూ.20 వేలు ఇస్తామని మాటమార్చేశారు. ఆ సాయం కూడా రైతులందరికీ అందుతందంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. రెండేళ్లుగా కౌలు రైతులకు పైసా పెట్టుబడి సాయం అందడంలేదు. విపత్తుల సమయంలో పంట నష్టపరిహారం ఇవ్వడంలేదు. రాయితీలు ఎండమావిగా మారాయి. సాగు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. కౌలు రైతులను టీడీపీ సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసింది. కౌలు రైతులకు గుర్తింపు లేకుండా చేసింది. రాయితీలు అందక, పెట్టుబడి సాయం లేక వడ్డీలకు అప్పులుచేసి పంటలు సాగుచేయాల్సిన దుస్థితి నెలకొంది. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం నిర్ధయతో వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రూపాయి సాయం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రూ.13,500 ఆర్థిక సాయాన్ని అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం ఆవేదనకు లోనవుతున్నారు.

ముందుకు సాగేదెలా..?

లబ్ధిదారుల కుదింపు..

కౌలురైతుకు అందని అన్నదాత

సుఖీభవ

కొత్తగా నమోదైన వారికి ఒక్కరికీ

విదల్చని పెట్టుబడి సాయం

గతం కంటే 45వేల మంది తగ్గింపు

2025–26లో అన్నదాత సుఖీభవ సాయం కింద చంద్రబాబు సర్కార్‌ జిల్లాలో 2,27,770 మందికి సాయం అందించారు. 2026–27లో తొలివిడతగా శనివారం అందించిన సాయంలోనూ ఆ సంఖ్య మారలేదు. కొత్తగా వేలాది మంది పథకం కోసం దరఖాస్తు చేసినా ఒక్కరైతుకూ సాయం అందించిన దాఖలాలు లేవు. ఈ రెండేళ్లలో వారసత్వంగా, భూములు కొనుగోలు చేయడం ద్వారా అనేక మంది భూ యాజమానులుగా నమోదయ్యారు. గతంలో వివిధ కారణాల వల్ల అనేక మందికి అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. వారి భూ, సాంకేతిక సమస్యలు పరిష్కరించినా ఈ ఏడాది పెట్టుబడి సాయం అందలేదు. వేలాది మందికి అన్నదాత సుఖీభవ సాయాన్ని దూరం చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2.72 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందేది. టీడీపీ సర్కారు ఆ సంఖ్యను 2.27 లక్షల మందికి తగ్గించేసింది. 45 వేల మంది లబ్ధిదారులకు సాయం అందడం లేదు. జిల్లాలో రూ.88 కోట్ల సాయాన్ని ఎగ్గొట్టేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఎక్కడైనా ఏటా రైతుల సంఖ్య పెరుగుతుంది కానీ... సర్కారు సాయం అందించడంలో సంఖ్య తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement