ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

డీఈఓ మాణిక్యంనాయుడు

గజపతినగరం రూరల్‌: పదోతరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రణాళికాయుతంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు అన్నారు. మండలంలోని మరుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆ తర్వాత కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూల్‌, ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. ప్రతిరోజు ప్రణాళికా బద్ధంగా చదివితే, పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారని సూచించారు. పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను, సర్వేపల్లి రాధాకష్ణ విద్యా మిత్ర కిట్ల పంపిణీపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 బి.సాయిచక్రధర్‌, ప్రధానోపాధ్యాయులు నాగమణి, జి.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల పరిశీలన

విజయనగరం క్రైమ్‌: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పరీక్షలో భాగంగా జేఎన్‌టీయూ కేంద్రాన్ని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర శనివారం సందర్శించారు. జిల్లాలో మొత్తం ఆరు సెంటర్‌లలో నీట్‌ పరీక్ష జరగనుందని, ఆయా మార్గాల్లో అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

పెన్సిల్‌ ముల్లుపై యోగా ముద్ర

కొత్తవలస: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దెందేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల డ్రాయింగ్‌ టీచర్‌ జి.పరమేశ్వరరావు శనివారం పెన్సిల్‌ ముల్లుపై యోగాసనం, యోగా ముద్ర చెక్కి అబ్బురపరిచారు. ఆయనను పాఠశాల హెచ్‌ఎం బి.సునీతతో పాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

రైతుల ఖాతాల్లోకి రూ.83.03 కోట్లు

పార్వతీపురం: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌’ తొలి విడత నిధులను కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 1,22,260 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.61.13 కోట్లు, 1,09,511మంది రైతులకు పీఎం కిసాన్‌ కింద రూ.21.90కోట్లు రైతుల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

ఇండక్షన్‌ స్టవ్‌ల పంపిణీ

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గతో కలిసి అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టవ్‌లను పంపిణీ చేశారు. పిల్లలు, గర్భిణులకు సురక్షితంగా, త్వరితగతిన పౌష్టికాహరం తయారు చేయడానికి ఈ స్టవ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టవ్‌ల పంపిణీపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

పాలకొండ రూరల్‌: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ సేవలు అందించేందుకు అవసరమైన బస్సులు లేవు... కాలం చెల్లిన టిమ్‌ పరికరాలతో నరకం చూస్తున్నాం అంటూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు పాలకొండ డిపో వద్ద శనివారం ఆందోళన చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నూతన టిమ్‌ యంత్రాలు మంజూరు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ నాయకులు వి.కె.రావు, పి.ఎల్‌.రావు, ఎస్టీ రావు, బీఎస్‌ రావు, డీజీ రావు, ఎం.ఆర్‌.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement