విజయనగరం అర్బన్:
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకు (రీ–నీట్ యూజీ) జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పరీక్షను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1901 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు పరీక్ష నిర్వహించనున్నామన్నారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. అఽభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్టుకార్డు సైజు కలర్ ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూ టూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు హ్యాండ్ బ్యాగులు, బెల్ట్‌లు, ఆభరణాలు, లోహపు వస్తువులు, అదనపు కాగితాలను అనుమతించమన్నారు. అభ్యర్థులు సాధారణ దుస్తులు, చెప్పులతో మాత్రమే హాజరుకావాలని సూచించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం పరీక్ష రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు 08922–236947 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు.
రీ నీట్ యూజీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి


