రుణం బంగారమాయె..! | - | Sakshi
Sakshi News home page

రుణం బంగారమాయె..!

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

రుణం బంగారమాయె..! ● రుణ మంజూరు, రెన్యువల్స్‌లో కొత్తమార్గదర్శకాలు ● రెన్యువల్‌కు పూర్తిమొత్తం చెల్లించాలన్న నిబంధన ● తిరిగి బంగారంపై తక్కువ రుణమొత్తం ● ఆవేదనలో రైతులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు గతంలో రెన్యువల్‌..ఇప్పుడు క్లోజర్‌..! చిరు వ్యాపారులకు పెద్ద దెబ్బ..

ఇలా అయితే కష్టమే...

సరళీకరించాలి..

నిబంధనలు సడలించాలి

అదనంగా ఉండడం వల్లే..

● రుణ మంజూరు, రెన్యువల్స్‌లో కొత్తమార్గదర్శకాలు ● రెన్యువల్‌కు పూర్తిమొత్తం చెల్లించాలన్న నిబంధన ● తిరిగి బంగారంపై తక్కువ రుణమొత్తం ● ఆవేదనలో రైతులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు

నెల్లిమర్ల రూరల్‌:

కప్పుడు ఇంట్లో బంగారం ఉంటే అత్యవసర పరిస్థితుల్లో అది ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉండేది. ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులు.. ఇలా ఏ అవసరం వచ్చినా బ్యాంకులో బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకుని గట్టెక్కెవారు. గడువు ముగిసినప్పుడు వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్‌ చేసుకునేవారు. ఏడాది కాలంగా బంగారు రుణాలపై అమలవుతున్న కొత్త విధానాలు లక్షలాది మంది రుణ గ్రహీతల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపార వర్గాలు, మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.

ఇంతక ముందు బంగారంపై తీసుకునే రుణం గడువు పూర్తయిన తర్వాత వడ్డీ లేదా కొంత మొత్తాన్ని చెల్లించి రుణాన్ని రెన్యువల్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. బంగారం బ్యాంక్‌లో ఉండేదే తప్ప రుణగ్రహీతకు అదనపు ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో పాత రుణాన్ని పూర్తిగా క్లోజ్‌ చేసిన తర్వాతే కొత్త రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో ఒకేసారి లక్షల రూపాయలు సమకూర్చుకుని రుణం చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలకు అప్పుచేసి రుణం చెల్లిస్తున్నారు. తిరిగి బంగారం కుదవపెడుతున్నారు.

చిన్న వ్యాపారులు బంగారం రుణాలను వర్కింగ్‌ క్యాపిటల్‌గా వినియోగించుకోవడం సర్వ సాధారణం. కిరాణాషాపులు, కూరగాయల వ్యాపారులు, చిన్న హోల్‌సేల్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు తరచూ బంగారు రుణాలతోనే నగదు అవసరాలు తీర్చుకుంటారు. రెన్యువల్‌ ప్రక్రియ కఠినతరం కావడంతో వ్యాపార నిర్వహణకు అవసరమైన నగదు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు తమ పిల్లల చదువులు, వైద్యావసరాలు, వివాహాల ఖర్చులు, పంట పెట్టుబడికి బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. ఇప్పుడు వీరందరికీ రుణ నిబంధనలు అవరోధంగా మారాయి.

కొన్ని బ్యాంకుల్లో ఎంత బంగారం ఉన్నా రూ.2.5 లక్షలకు మించి రుణం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రత్యేక రుణ కేటగిరీలు, అంతర్గత బ్యాంక్‌ విధానాలు, రిస్క్‌ అంచనాల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చన్న వాదన బ్యాంకు వర్గాల నుంచి వినిపిస్తోంది.

వ్యవసాయ పనుల ఖర్చుల కోసం గతంలో బంగారం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకునేవారం. వ్యవసాయం కలిసిరాకుంటే వడ్డీకట్టి రుణాన్ని రెన్యువల్‌ చేసుకునేవారం. ఇప్పుడు బ్యాంకుకు వెళ్తే పూర్తిగా రుణం డబ్బులు కట్టమని చెబుతున్నారు. ఇలా అయితే నగదు సర్దుబాటు చేసుకోవడం కష్టం.

– చందక బలరాం, రైతు, నెల్లిమర్ల మండలం

బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల రెన్యువల్‌ ప్రక్రియను సరళీకరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారు రుణ విధానాల్లో సమతుల్యత పాటించాలి.

– సురేష్‌, ఒమ్మి గ్రామం, నెల్లిమర్ల మండలం

నా కుమార్తె పెళ్లి అవసరాల నిమిత్తం బ్యాంకులో బంగా రం కుదవ పెట్టి గతంలో రూ.5లక్షల వరకు రుణం తీసుకున్నాను. ఆ తరువాత రూ.2లక్షలు చెల్లించి కొంత బంగారం విడిపించుకున్నాను. మళ్లీ రుణం కోసం బ్యాంక్‌ అధికారు లను సంప్రదిస్తే నిబంధనలు మారడం వల్ల ఇవ్వలేమని చెప్పేశారు. కావాలంటే ఇంకో వ్యక్తి పేరుపై తీసుకోవాలని చెప్పారు. చేసేదిలేక బయట ఎక్కువ వడ్డీకు అప్పుకు తీసుకోవాల్సి వచ్చింది. మా లాంటి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ విధానం సరికాదు.

– సునీత, సతివాడ గ్రామం, నెల్లిమర్ల మండలం

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం గోల్డ్‌ లోన్స్‌ ఉండాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నా యి. బంగారం కంటే లోన్‌ డబ్బులు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడైనా గోల్డ్‌ క్రాస్‌ అయితే బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీంతో బ్యాంకులన్నింటికీ ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల ను జారీ చేసింది. వ్యవసాయానికి, ఇంటి అవస రాలకు రూ.2.50లక్షలు ఉపయోగించుకోవచ్చు. వ్యాపారం నిమిత్తం అదనంగా అవసరమైతే నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్‌, ఇతర పత్రా లు చూపించాల్సి ఉంటుంది. మారిన మార్గదర్శకాలను ప్రజలు గమనించి సహకరించాలి.

– రవికుమార్‌, బ్యాంక్‌ మేనేజర్‌,

ఏపీజీవీబీ, నెల్లిమర్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement