అవకాశం కల్పిస్తాం..
విజయనగరం గంటస్తంభం:
నమ్మించడం.. లబ్ధిపొందడం.. అనంతరం మోసం చేయడం.. ఎదురు తిరిగిన వారి మైండ్‌ను ఉత్తుత్తి పథకాలు, ఎల్లోమీడియాలో ప్రచారాలతో డైవర్షన్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. నిరుద్యోగులను మోసం చేయడంలో ఆయన సఫలమయ్యారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. ఉద్యోగాలు కల్పించకుంటే నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవేవీ ఆచరణ సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఆరంభమైంది. ఇది గమనించిన సర్కారు ‘కౌశలం’ (స్కిల్ టెస్ట్) పేరుతో కపట నాటకానికి తెర తీసింది. ఇంజినీరింగ్ పట్టభద్రులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి అందుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టింది. దీనిని నమ్మిన జిల్లాకు చెందిన వేలాది మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో స్కిల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్నారు. అయితే, జిల్లాలో 51,447 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పటివరకు కేవలం 3,600 మందికే స్కిల్ టెస్ట్ నిర్వహించగా, అందులో 47 మందికి మాత్రమే ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగు లు గగ్గోలు పెడుతున్నారు. ఇదెక్కడి కౌశలం పరీక్ష అంటూ నిట్టూర్చుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ కలిసికట్టుగా తమ గొంతుకోసేశారంటూ కన్నీరుపెడుతున్నారు. వెయ్యి మందిలో ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేని నాయకత్వ నైపుణ్యానికి నిరుద్యోగులు జోహార్లు పలుకుతున్నారు.
అంతా భ్రమల ప్రపంచమేనా?
ఐటీ కంపెనీలు లైన్లు కడతాయని, ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలతో రూ.లక్షలో సంపాదించుకోవచ్చని విద్యాశాఖమంత్రి లోకేశ్ బాబు చెప్పిన కాకమ్మ కథలు నమ్మి మోసపోయామని నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. కౌశలం పేరుతో కొత్త పథకం ప్రారంభించి మోసం చేశారని వాపోతున్నారు. అబద్ధాల కూటమికి ఓటేసి గెలిపించినందుకు మా చేతులు మేమే నరుక్కోవాలంటూ జిల్లా యువత విరక్తితో శాపనార్ధాలు పెడుతోంది.
కౌశలం కార్యక్రమం విజయనగరం జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రక్రియ. తొలి విడతలో కొంతమంది అభ్యర్ధులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాం. మిగిలిన 47,800 మంది అభ్యర్థులకు త్వరలోనే విడతల వారీగా పరీక్షలు పూర్తిచేస్తాం. అనంతరం మెరి ట్, నైపుణ్యాల ఆధారంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.
– ఎం.రోజారాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి(డీడీఓ), జీఎస్‌డబ్ల్యూఎస్, విజయనగరం


