ఇండెంట్ ప్రకారం సరఫరా
● బీపీ, థైరాయిడ్, దగ్గు, ఆయాసం బాధితులకు అందని మందులు ● వైద్య శిబిరాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్న వైనం
విజయనగరం ఫోర్ట్:
●జామి మండలానికి చెందిన రాములమ్మ అనే వృద్ధురాలు గత కొంత కాలంగా బీపీతో బాధపడుతోంది. బీపీ మందుల కోసం ఆమె 104 శిబిరానికి వెళ్తే మందులు లేవని
చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
●గంట్యాడ మండలానికి చెందిన
సింహాచలం అనే వృద్ధురాలు బీపీతో
బాధపడుతోంది. ఎమ్లాడోఫిన్ మాత్రల కోసం 104 వాహన శిబిరం వద్దకు వెళ్తే లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
జిల్లాలో 104 వాహన వైద్య శిబిరాలకు వచ్చే రోగులకు మందుల కొరత వెంటాడుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు లభించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహన నిర్వహణ బాధ్యతలు తీసుకున్న భవ్య సంస్థ... ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చూపుతోందని రోగులు విమర్శిస్తున్నారు. శిబిరాల్లో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాథమిక స్థాయి వైద్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ, అవసరాన్ని బట్టి రోగులను సమీప పీహెచ్‌సీలకు రిఫర్ చేయడం, దగ్గర్లో ఆస్పత్రి సౌకర్యం లేని ప్రజలు, గర్భణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు 104 వాహన శిబిరాలే ఆధారం. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. వీటిలో చాలా వాహనాల్లో మందుల కొరత నెలకొంది. బీపీ రోగులు వినియోగించే టెల్మా, ఎమ్లాడోఫిన్, ఎటిన్‌లాల్, యాంటీ బయాటిక్ మందులు అయిన మెట్రోజెల్, నారఫ్లాక్సిన్, ఎమాక్సిలిన్–625, ఎమాక్సిలిన్–500 ఎంజి, ఎమాక్సిలిన్ 250 ఎంజీ మాత్రలు, థైరాయిడ్ వ్యాధికి ఉపయోగించే థైరాయిడ్ 100 ఎంజీ మాత్రలు, థైరాయిడ్ 50 ఎంజీ, థైరాయిడ్ 25 ఎంజీ మాత్రలు, గాయాలు తగ్గడానికి ఉపయోగించే ప్రొవిడెన్ ఆయింట్ మెంట్, విప్రోసిన్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు ఉపయోగించే క్లోట్రోమైజోల్ ఆయింట్ మెంట్స్, దగ్గుకు ఉపయోగించే సాల్‌బాటమాల్ సిరప్, ఎంబ్రాక్సిల్ సిరప్‌లు 104 వాహనాల్లో లేవని రోగులు చెబుతున్నారు. మందుల కోసం పీహెచ్‌సీలకు, జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో అన్ని రకాల మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు.
104 వాహనాల్లో మందులు కావాలని ఇండెంట్ పెడుతున్నారు. ఆ మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని వాహనాలకు సరఫరా చేస్తాం.
– కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్


