● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
రేగిడి: గ్రామాల్లో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్‌ఏలు పాల్గొని నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్‌ఏ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదై ఉండేలా చూడాలని సూచించారు. ఎటువంటి లోపాలు, అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది వంటిదని, సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ఓటు హక్కు కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, మండల యూత్ కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు విద్యాయాప్‌ను ప్రారంభించిన డీఈఓ
విజయనగరం అర్బన్: భోగాపురం మండలం ముంజేరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆర్.సూర్యప్రకాశ్‌రావు రూపొందించిన తెలుగు విద్యాయాప్‌ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగు భాషాబోధనను సులభతరం చేయడంతోపాటు విద్యార్థుల అభ్యాసనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు యాప్ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌యూటీ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ని అప్పలనాయడు, భాస్కరరావు, తదితరులు పాల్గొని సూర్యప్రకాశ్‌ను అభినందించారు.
ముచ్చర్ల ఉన్నత పాఠశాలకు భూ దానం
● దాత సూర్యనారాయణరాజు ఔదార్యం
గజపతినగరం రూరల్: మండలంలోని ముచ్చర్ల ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన వెలగాడ సూర్యనారాయణరాజు 14 సెంట్ల ఖరీదైన భూమిని దానంచేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు స్థలం లేకపోవడంతో పక్కనే గల సూర్యనారాయణ రాజు స్థలంలో కొంత స్థలాన్ని దానం చేయా లని జెడ్పీటీసీ గార తవుడు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. పాఠశాలలో గురువారం అందరి సమక్షంలో భూమిని ఇస్తున్నట్టు ప్రకటించారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తిచేసి, విద్యాశాఖకు సంబంధిత పత్రాలు అందజేస్తానని తెలిపారు. ఖరీదైన స్థలాన్ని తన తండ్రి పేరిట దానం చేసిన సూర్యనారాయణరాజు ఔదార్యాన్ని అందరూ అభినందించారు. కార్యక్రమంలో దాత, జెడ్పీటీసీతో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కరుమజ్జి కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ మీసాల సన్యాసినాయుడు, సూర్యనారాయణ, శనపతి ఈశ్వరావు, గిరడ అచ్చెన్నాయుడు, బైరెడ్డి తవుడు, రుంకాన నాగరాజు, భాస్కరరావు, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.


