● నువ్వే ఆశ, ఆధారమనుకున్నాం
● రోడ్డు ప్రమాదంలో పదో తరగతి
విద్యార్థి మృతి
● విషాదంలో తల్లిదండ్రులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): మా కొడుకు బాగా చదివి మంచి స్థాయికి చేరాలని ఎన్నో కలలు కన్నాం, మా కుటుంబానికి మా కొడుకే ఆశ, ఆధారం అనుకున్నాం. నాయనా..లే.. కళ్లు తెరువు..అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు రోదిస్తుంటే చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ విషాద వార్త వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థి గుంటు అవినాష్(15) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి అవినాష్ గరివిడిలో గల గోదావరి దేవి షరాఫ్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న స్కూల్ ప్రారంభం రోజున పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా చీపురుపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మ్యాక్సీక్యాబ్ అవినాష్ సైకిల్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను వెంటనే విజయనగరంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశాడు. తల్లిదండ్రులు మోహన్, పుష్పలకు ఒక కుమార్తె, కుమారుడు కాగా కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుమారుడిని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.


