● నిబంధనలు వర్తిస్తాయి
● గత ఏడాది అర్హత ఉన్నా పలువురికి లబ్ధి సున్నా
సాంకేతిక సమస్య పేరిట
మాది మధ్య తరగతి కుటుంబం. నేను రోజువారీ పనులు చేసి కుటుంబాన్ని పోషించడంతో పాటు నా బిడ్డ తనుశ్రీని చదివిస్తున్నాను. అర్హత ఉన్నా గత ఏడాది పథకం వర్తించలేదు. నా బిడ్డకు తల్లి పేరు మారడంతో వారి ఆస్తులు మా అకౌంట్‌కు లింక్ అయ్యాయి. ఇది సాంకేతిక సమస్య. అప్పట్లో అన్నీ సరిచేయించాను. సచివాలయంలో నగదు జమ చేయనున్న అర్హుల జాబితాలో మా పేర్లు వచ్చాయి. అయినా నగదు జమకాలేదు. దీంతో ఈ ఏడాది పరిస్థితిని ముందుగానే సరిచేసుకునేందుకు క్రమం తప్పకుండా ఉపాధ్యాయులను సంప్రదిస్తున్నాను.
బి.లక్ష్ముంనాయుడు,
విద్యార్థిని తండ్రి, పాలకొండ మండలం
పాలకొండ రూరల్: అన్నీ ఉన్నా అర్హుల నోట్లో శని అన్నట్లుంది సర్కారు తీరు. అన్నివర్గాల పిల్లల తల్లిదడ్రులు వారి బిడ్డల చదువులకు ఆర్థిక భారం అడ్డుకాకూడదని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ పేరిట బృహత్తర పథకాన్ని రూపొందించారు. నాడు వలంటీర్ల వ్యవస్థ ఇంటింటి సర్వే చేపట్టి చదువుతున్న పిల్లను గుర్తించి, వారికి సంబంధించిన వివరాలను సచివాలయాల ద్వారా నమోదు చేయించారు. అప్పట్లో అర్హత ఉన్న ఏఒక్క తల్లి ఈ పథకాన్ని కోల్పోకుండా జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఆపై అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఈ పథకం పేరు మార్చింది. ఇంట్లో ఎంత బిడ్డలు చదువుకుంటే అంతమందికి రూ.15వేలు అందిస్తామంది. అధికారం చేపట్టిన ఏడాది పథకం ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం గత ఏడాది అర్హత ఉన్నా వందల సంఖ్యలో తల్లులకు నగదు జమచేయలేదు. యంత్రాంగం చేసిన తప్పులకు తల్లితండ్రులనే బాధ్యులుగా చేసి లబ్ధికి దూరం చేశారు. ఈ ఏడాది మళ్లీ పథక వర్తింపునకు నిబంధనలు వర్తిస్తాయని..ప్రభుత్వం చూపిస్తున్న అన్ని రూల్స్ అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది. దీంతో అర్హత ఉండి లబ్ధి కోల్పోయిన అర్హులు ఈ ఏడాదైనా తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ ఉండాల్సిందే..
ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తల్లికి వందనం పథకం వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో అర్హుల జాబితా ప్రదర్శించిన వెంటనే అర్హులు సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. మై ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌లో చెక్ ఆధార్ బ్యాంక్ లింకేజీ స్టేషన్ ఎంపిక చేయాలి. ముఖ్యంగా తల్లి, లేదా విద్యార్థి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆధార్‌కు లింక్ అయిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. తద్వారా మీ ఆధార్ ఏ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉందో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో అర్హులు తమ బ్యాంక్ ఖాతా ఏశాఖ పరిధిలో ఉందో తెలుసుకుని ఖాతా ప్రస్తుతం మనుగడలో ఉందో లేదో సరిచూసుకోవాలి. సమస్యలు గుర్తిస్తే అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో బ్యాంక్‌కు వెళ్లి అప్‌డేట్ చేయించాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, సెల్ నంబర్ అనుసంధానం ఒకేలా ఉండేలా సరి చేయించాలి. లేకుంటే గత అనుభవాలను మళ్లీ చవిచూడాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు మీ ఖాతా వివరాలు అనుసంధానమైన వెంటనే మీ సెల్‌ఫోన్‌కు లబ్ధికి సంబంధించిన సమాచారం వస్తుందని గుర్తించాలి.
నాడు అర్హతే ప్రామాణికంగా..
నాడు జగనన్న హయాంలో తల్లులకు ఎటువంటి జంఝాటం లేకుండా అర్హతే ప్రామాణికంగా తల్లుల ఖాతాలకు చెప్పిన సమయానికి నగదు జమ అయ్యేందని లబ్ధి పొందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ అధికారులు సమన్వయంతో విద్యాశాఖ పర్యవేక్షణలో తల్లులకు నగదు అందింది. నేడు ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన లేక అర్హత ఉన్నా సమస్యలు తప్పడం లేదు. దీనిని అదిగమించే ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. దీంతో గత అనుభవాలను గుర్తు చే సుకుంటున్నారు. నాడు అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన తల్లులకు నేటికీ తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా అర్హుల జాబితాల్లో తామ పిల్లలు ఉండాలని అన్నీతామై ఏ యాప్‌లో ఏం చెక్ చేయమన్నా తక్షణమే స్పందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, పాఠశాలల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారంటే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లిడండ్రులకు ముందస్తు సమాచారం అందిస్తున్నామంటున్నారు.
జిల్లాలో పరిస్థితి..
పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 1,507 పాఠశాలల్లో ఈ ఏడాది లక్షా 30వేల మంది బోధన పొందుతున్నారు. ఇదే క్రమంలో జూనియర్ కళాశాలలు 30 ఉండగా వాటిలో 19వేల మంది అభ్యసిస్తున్నారు. మొత్తంగా జిల్లా పరిధిలో లక్షా 49వేల మంది ఒకటి నుంచి ఇంటర్ మధ్య చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జిల్లా పరిధిలో లక్షా 22వేల మందికి పథకం వర్తింపజేశామని, 8వేలకు పైచిలుకు మందికి వివిధ కారణాలతో లబ్ధి చేకూరలేదని అధికారులు చెబుతున్నారు.


