తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో మంగళవారం రాత్రి మూడు గడ్డివాములు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయని వీఆర్‌ఓ ఎల్.గణపతి బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన పల్ల శ్రీరాములు, సాకేటి సూర్యనారాయణ, సాకేటి జనార్దన అనే ముగ్గురు రైతులకు సంబంధించిన గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా? మరేవిధంగా జరిగిందా? అనేది తెలియడంలేదని బాధిత రైతులు అంటున్నారు. ఏడాది పొడవునా పశువులకు గ్రాసంగా ఉపయోగించేందుకు సిద్ధం చేసుకున్న గడ్డివాములు కాలిపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిడుగుపాటుతో పాడి ఆవు మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని గొర్లిపేట గ్రామంలో పిడుగుపాటుకు ఓ పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన గొర్లి ఎల్లంనాయుడు తన పాడి ఆవును కళ్లంలోని చెట్టు కింద కట్టి ఉంచగా బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న ఆవు ఒక్కసారిగా కుప్పకూలి మృత్యువాత పడగా రైతు కు టుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
గరివిడి మండలంలో మరో ఆవు..
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని నీలాద్రిపురం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో గ్రామంలోని నాకమ్మ చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంపై పిడుగు పడడంతో విద్యుత్ వైర్లు తెగి పక్కనే మేత మేస్తున్న ఆవుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన ఆవు ఆరు నెలలు చూడితో ఉందని, ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని బాధితురాలు చందక బారతి తెలిపింది. ఆవు మృతితో తమ కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని, జీవనాధారంగా ఉన్న పాడి సంపదను కోల్పోయామని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం,పశు సంవర్థకశాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఎండ వేడికి 200 కోళ్లు మృతి
గుర్ల: మండలంలోని దమరసింగి గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం, భరించలేని ఎండ కారణంగా గ్రామంలో 200 కోళ్లు మృతి చెందాయని ఫారం నిర్వాహకుడు సంచాన ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కోళ్ల మరణంతో ఆర్థిక నష్టం జరిగిందని వాపోయాడు. ఉపాధి హామీ పనులు ముగించుకుని మండుటెండల్లో ఇంటికి చేరుకుంటున్న కూలీలు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
యువతి అదృశ్యం
సంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామానికి చెందిన యువతి(22) మతి స్థిమితం లేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదివరకు రెండు సార్లు అదృశ్యం కావడం వేరే చోట ఆచూకీ లభ్యమైందని, అనంతరం హైదరాబాద్‌లోని సిటీ నర్సింగ్ హోమ్‌లో జాయిన్ చేశామని, 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి మళ్లీ ఎటో వెళ్లి పోయిందని తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


