రామభద్రపురం: ఈ నెల ఒకటో తేదీన ఓ వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనాన్ని సంఘటన స్థలంలో పడి ఉన్న చేపల ట్రే ఆధారంగా తొమ్మిది రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు. వాహనానికి సంబంధించి విరిగి పడి ఉన్న నంబర్ ప్లేట్ ముక్కలు, చేపలతో ఉన్న ట్రే ఆధారంతో పాటు సాంకేతికతను ఉపయోగిస్తూ ఎస్సై వి. ప్రసాదరావుతో కూడిన పోలీసు బృందం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాహనాన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్‌స్టోరేజ్ వద్ద ఈ నెల ఒకటో తేదీ వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో బాడంగి మండలం వాడాడకు చెందిన కల్లూరి బైరాగి మృతిచెందిన సంఘటన తెలిసిందే. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం సాలూరుకు చెందిన జి. సాయికుమార్‌దిగా పోలీసులు గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న చేపల ట్రే ఆధారంగా పోలీసులు గజపతినగరం, సాలూరు, దత్తిరాజేరు, తదితర గ్రామాల్లో చేపల విక్రయదారులను విచారించి, సాయికుమార్‌ను అనుమానితుడిగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే సాయికుమార్‌ను ప్రశ్నించగా.. ప్రమాదానికి తానే కారణమని అంగీకరించాడు.


