ఎస్‌ఐ అక్రమాలపై ఆరా! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ అక్రమాలపై ఆరా!

Mar 10 2026 7:07 AM | Updated on Mar 10 2026 7:07 AM

చీపురుపల్లి: చీపురుపల్లి ఎస్‌ఐ అవినీతి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. సాక్షాత్తూ పోలీస్‌శాఖ అత్యున్నత కార్యాలయమైన డీజీ కార్యాలయం నుంచి అంతర్గత విచారణ జరుగుతోంది. మరోవైపు సబ్‌ డివిజిన్‌ స్థాయిలోనూ దర్యాప్తు ప్రారంభమైంది. రోడ్డుపై తోపుడుబళ్లు నిర్వహించుకునేవారు, చిరువ్యాపారులు, వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే పేదలు, రాజకీయనాయకుల నుంచి, అమ్మవారి జాతర్లో పట్టాట, గుండాటను ప్రోత్సహిస్తూ రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు కేరాఫ్‌గా మారాన్న అపవాదు ఉంది. ఇదే విషయంపై ‘పోలీస్‌ దందా’ ‘శీర్షిక’న ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్‌ఐ తీరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఎస్‌ఐ గ్యాంగ్‌లో బీపీ పెరిగింది. ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఎస్‌ఐ పై విచారణ జరుగుతుండడంతో ఆయన బాధిత వర్గం సంతోషపడుతున్నట్టు సమాచారం. ప్రజల సంగతి పక్కన పెడితే పోలీస్‌ స్టేషన్‌లో కొందరు సిబ్బంది కూడా ఆయన వేధింపులు తట్టుకోలేక, ఉన్నతాధికారులకు చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఎస్‌ఐ తీరుపై పోలీస్‌ ఉన్నతాధికారుల దర్యాప్తు ను స్వాగతిస్తూ, అరాచకాలు, అక్రమాలపై తమ కు తెలిసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్‌ బ్రాంచి, ఇంటలిజెన్స్‌ వర్గాలు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. జాతరలో జూదంను ప్రోత్సహించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి ఉదంతాలు కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. తోపుడుబళ్లు, చిరువ్యాపారులు, పలువురు రాజకీయనాయకుల నుంచి ఎస్‌ఐ వసూళ్ల వివరాల సమాచా రం సేకరించినట్టు బోగట్టా.

నకిలీ ఉద్యోగ ప్రకటనలు

నమ్మవద్దు

విజయనగరం ఫోర్ట్‌: వైద్యారోగ్యశాఖలో నోటిఫికేషన్‌ లేకుండా స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వందల మందికి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగినంటూ కిరణ్‌ అనే వ్యక్తి ఫోన్‌చేసి మోసంచేస్తున్న యత్నంపై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి స్పందించారు. ‘దగా చేసే యత్నం..!’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ వైద్యారోగ్యశాఖలో ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగడంలేదన్నారు. ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల కాలేదన్నారు. సోషల్‌ మీడియా, ఇతర మార్గాల ద్వారా వస్తున్న నకిలీ కాల్స్‌, మెసేజ్‌లు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే అస్సలు నమ్మవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అధికారక సమాచారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికార వెబ్‌సైట్లలో ప్రకటిస్తామని తెలిపారు.

చీపురుపల్లి ఎస్‌ఐ తీరుపై డీజీ ఆఫీస్‌ నుంచి విచారణ..

ఎస్బీ, ఇంటలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచార సేకరణ

చిరువ్యాపారులు, తోపుడుబళ్ల నిర్వాహకుల నుంచి వసూళ్ల

వివరాల సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement