విజయనగరం గంటస్తంభం:
విద్యకు నిలయంగా పేరొందిన విజయనగరం నిరుద్యోగ యువత కొలువుల సాధనకు ఆశల కేంద్రంగా మారింది. కొలువుల సాధనే లక్ష్యంగా పల్లెల నుంచి నిరుద్యోగ యువత నగరబాట పడుతున్నారు. చిన్నచిన్న అద్దెగదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొలువుల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో రోజంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. పార్కులు, చెట్ల కింద, మైదానాలు, గ్రంథాలయాలను చదువు వేదికలుగా మలచుకుంటూ... కలిసికట్టుగా కొలువుల సాధనకు కష్టపడుతున్నారు.
చిన్నగదుల్లో పెద్దపెద్ద కలలు..
విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, మరికొన్ని చోట్ల ముగ్గురు లేదా నలుగురు కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. చదవడానికి సరైన వాతావరణం లేకపోయినా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. చిన్నగదుల్లోనే పెద్ద లక్ష్యాలతో చదువుతున్న యువత కష్టాలు.. వారి జీవిత పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా..
నగరానికి వచ్చే యువతలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలిపనులు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పిల్లలకు పంపిస్తున్నారు. నగరంలో జీవనం సులభం కాదు. అద్దె గదులు, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులు, కోచింగ్ ఖర్చులు.. ఇవన్నీ కలిపి వారికి పెద్ద భారంగా మారుతున్నాయి. ఒక పరీక్షకు అప్లై చేయాలంటే రూ.200 నుంచి రూ.500 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగ సాధన కోసం ఆర్థిక కష్టాలు భరిస్తూనే పుస్తకాలతో నేస్తం చేస్తున్నారు. పలు శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతికింద ప్రతినెలా రూ.3వేలు ఇస్తా మని హామీ ఇచ్చారు. కనీసం ఆ డబ్బులు ఇచ్చినా ఉద్యోగ సాధన శిక్షణకు ఉపయోగపడేవని, పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవికాదని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులను మోసం చేయడం చంద్రబాబుకు తగదని చెబుతున్నారు.
రోజంతా గదుల్లో చదవడం కష్టంగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గురజాడ గ్రంథాలయం యువతకు ప్రధాన చదువు కేంద్రంగా మారింది. ఇంకొందరు ప్రశాంత వాతావరణం కోసం పెద్దచెరువు, మయూరి పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్లి చెట్లనీడలో కూర్చుని చదువుతున్నారు. గ్రూప్ డిస్కషన్స్‌తో ముందుకు సాగుతున్నారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంక్, ఎస్‌ఎస్‌సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు.
గ్రామాల నుంచి నగరానికి వస్తున్న యువత
ఉద్యోగ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగులు
పార్కులు, గ్రంథాలయాలే చదువుల
వేదికలు
ఇరుకు గదుల్లో పుస్తకాలతో కుస్తీ
వివిధ సంస్థల్లో శిక్షణ
గురజాడ
గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత


