
నేర నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ సెర్చ్‘
విజయనగరం క్రైమ్: నేరాలను నియంత్రించి, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో భాగంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లో గల గిరిజన గ్రామాల్లో ’కార్టన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ గురువారం నిర్వహించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి సారా, గంజాయి లభించలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి పంచాయతీ గిరిజన గ్రామాలైన మునుపురాయి, రాయపాలెం, చప్పనిగెడ్డ, పల్లపు దుంగాడ, రంగవలస, పాతశెనగపాడు, కొత్త సెనగపాడు, దబ్బగుంట గ్రామాల్లోను మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, బొడ్డపాడు, చిలకపాడు, చిట్టెంపాడు, గుణపాడు గ్రామాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారన్నారు. ఈ బృందాలకు ఎస్.కోట సీఐ వి.నారాయణ మూర్తి, కొత్తవలస సీఐ షణ్ముఖరావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు నాయకత్వం వహించారన్నారు. ఈ ఆపరేషన్‌లో 16మంది ఎస్సైలు, 85 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, వారికి నిర్దేశించిన గిరిజన గ్రామానికి చేరుకుని, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలు ముందుగానే దిగ్బంధం చేసినట్లు చెప్పారు.