
స్కూల్ ఆటో బోల్తా
● ఐదుగురు విద్యార్థులకు గాయాలు
● మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్
కొత్తవలస: మండలంలోని విజయనగరం–కొత్తవలస రోడ్డులో అర్ధాన్న పాలెం జంక్షన్ సమీపంలో గురువారం స్కూల్ ఆటో బోల్తాపడిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు మంగళపాలెం, రాజాథియేటర్ సమీపంలోని వారిని రోజూ ఆటోలో స్కూల్‌కు తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అయితే గురువారం విద్యార్థులను యథావిధిగా స్కూల్ వద్ద డ్రైవర్ దింపేశాడు. మళ్లీ స్కూల్ వదిలే సమయంలో తిరిగి పిల్లలను ఆటో ఎక్కించుకుని వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు పి ల్లల్లో 7వ తరగతి చదువుతున్న కె.మహేంద్ర కాలికి తీవ్ర గాయమైంది. అలాగే 9వ తరగతి చదువుతున్న డి.నిరిషా నడుముకు గాయమైంది. స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను కొత్తవలసలో గల ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.కాగా ఆటో డ్రైవర్ పూటుగా మద్యం తాగి ఉన్నాడని, ఆటోపై ఫీట్‌లు చేశాడని అదే సమయంలో ఆటో బోల్తా పడిందని విద్యార్థులు తెలిపారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

స్కూల్ ఆటో బోల్తా