
కమనీయం.. కడు రమణీయం!
● రామతీర్థంలో
వైభవంగా
సీతారాముల
తిరుక్కల్యాణం
● కన్నుల పండువగా సాగిన స్వామివారి ఎదురు సన్నాహ
మహోత్సవం
● కనులారా
తిలకించిన
భక్తజనం
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాములోరి సన్నిధిలో సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. పవిత్ర భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారి తిరుక్కల్యాణాన్ని అర్చకులు వైఖాసన ఆగమోక్తంగా జరిపించారు. ఆలయంలో వేకువజామునుంచే కల్యాణ మహోత్సవ సందడి ప్రారంభమైంది. ముందుగా రామకోనేరు పవిత్ర జలంతో ఆలయాన్ని శుద్ధిచేశారు. అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వరప్రసాద్, కిరణ్, పవన్‌కుమార్, తదితరులు స్వామివారికి ప్రాతఃకాల అర్చన చేసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు శ్రీమద్రామాయణ పారాయణం, వేదపఠనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో గంటన్నర సమయం పాటు విశేష హోమాలు జరిపించారు. సాయంత్రం 5 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్టాపన, బలిహరణం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేపట్టి సమస్త దేవతామూర్తులను స్వామివారి కల్యాణానికి ఆహ్వానించారు.
మంగళ వాయిద్యాలు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణ నడుమ సీతారామస్వామి వారిని పట్టువస్త్రాలతో సుందరంగా ముస్తాబు చేశారు. వివిధ రకాల స్వర్ణాభరణాలతో సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రాత్రి 7 గంటలకు హంస, అశ్వ, గరుడ వాహనాలపై ఉత్సవ విగ్రహాలను రామతీర్థం పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి మూడు వాహనాల సేవను జరిపించారు. ఊరేగింపులో భాగంగా సీతమ్మ, శ్రీరాముడి వాహనాలు ఎదురుపడినప్పుడు అర్చకులు వేద మంత్రాలతో తిరుక్కల్యాణ విశిష్టతను భక్త జనులకు వినిపించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపానికి తీసుకువచ్చి స్వామివారి వివాహ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఆచారంగా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన ఏకుల కుటుంబీకులు పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని స్వామివారికి సమర్పించారు.
మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా...
ఆకట్టుకున్న మూడు వాహనాల సేవ..
సీతా సమేత రామస్వామి వారిని ఆస్థాన కల్యాణ మండపంలోనికి వేచింపజేసి ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి అనంతరం గణపతి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకస్వాముల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతమ్మవారి శిరస్సుపైన జీలకర్రబెల్లం పెట్టించి సీతారాముల తిరుక్కళ్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. రామ క్షేత్రమంతా భక్త పారవశ్యంతో పులకించిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును నిర్వహించారు. కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు దేవస్థాన సిబ్బంది ఉచిత ప్రసాదాన్ని అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్యాణోత్సవ ఏర్పాట్లను ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

కమనీయం.. కడు రమణీయం!

కమనీయం.. కడు రమణీయం!

కమనీయం.. కడు రమణీయం!

కమనీయం.. కడు రమణీయం!

కమనీయం.. కడు రమణీయం!

కమనీయం.. కడు రమణీయం!