
ఆర్థిక సాయంలో పెద్ద మనసు
ఈమె పేరు సారాపెంట సరస్వతి. మెరకముడిదాం మండలంలోని సోమలింగాపురం ఈమె స్వగ్రామం. క్యాన్సర్ బారిన పడిన ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు జెడ్పీ ఆగంతక నిధుల నుంచి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంజూరు చేశారు. ఆమెలాగే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎస్.గణపతి (జి.మర్రివలస)కి రూ.25 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు అట్టాడ రవితేజ (జొన్నవలస)కు రూ.25 వేలు మంజూరు చేశారు. కిడ్నీ మార్పిడి వైద్య సహాయం కోసం మరోసారి రూ.40 వేలు రవితేజకు అందించారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్ పేటకు చెందిన నక్కల అప్పన్నకు రూ.40 వేలు ఆర్థిక సాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాలకొండ మండలం అర్తం గ్రామానికి చెందిన బొట్టా రాజ్‌కుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు అందించారు. వైద్య ఖర్చుల కోసమే మన్నేపూరి ఉమామహేశ్వరరావు (వెదుళ్లవలస)కు రూ.50 వేలు, బి.బిద్యాక్షరి (ఎస్.కోట)కి రూ.50 వేలు, ఎం.శంకర్రావు (పల్లి గండ్రేడు)కు రూ.50 వేలు అందించారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు
ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు జెడ్పీ నుంచి నిధులు మంజూరు చేశారు. ఆర్‌వో ప్లాంట్లు, ఇన్వెర్టరు బ్యాటరీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు సమకూర్చారు. అలాగే జడ్పీ నిర్వహణలో 237 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలోని 107 ప్యానల్ పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నీ మంజూరు చేశారు. జూనియరు అసిస్టెంట్ లేదా రికార్డు అసిస్టెంట్ రెండు పోస్టులు మంజూరైన ఈ పాఠశాలల నుంచి ఒకరు చొప్పున 130 నాన్ ప్యానల్ పాఠశాలల్లో డ్రాఫ్టెడ్ టు వర్క్ విధానంలో నియమించారు. దీనివల్ల ఉపాధ్యాయులు పూర్తి సమయాన్ని సబ్జెక్టుల బోధనకు వినియోగిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతోంది.
మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్
మౌలిక వసతులకు పెద్దపీట
ఈ చిత్రం చీపురుపల్లి మండలం పీకే పాలవలస గ్రామంలో జెడ్పీ నిధులు రూ.4.90 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న సీసీ రోడ్డు. గతంలో ఇక్కడ సీసీ రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు. ఇలా గత రెండేళ్లలో మౌలిక వసతుల పనులకు పెద్దపీట వేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు, రహదారుల మరమ్మతులు తదితర 301 సాధారణ పనులకు రూ.11.40 కోట్లు మంజూరు చేశారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు, కాలువల నిర్మాణానికి రూ.3.88 కోట్లతో 160 పనులు చేపట్టారు. ఎస్సీలకు సంబంధించి రచ్చబండలు, సామాజిక భవనాల మరమ్మతులు, సీసీ రోడ్లు, బోరు బావులకు సంబంధించి 26 పనులకుగాను రూ.84 లక్షలు మంజూరు చేశారు. గిరిజనుల ఆవాసాల్లో సీసీ రోడ్లు, బోరుబావులు, గ్రావెల్ రోడ్లు తదితర 65 పనుల కు రూ.1.08 కోట్లు ఇచ్చా రు. సుమారు రూ.2.01 కోట్ల వ్యయంతో 34 అంగన్వాడీ భవనాల మరమ్మ తులు చేయించారు. ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.46 లక్షల వరకూ మంజూరు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 2020 – 21, 2022 – 23 సంవత్సరాలకు సంబంధించి రూ. 23.45 కోట్లు వచ్చాయి. వాటితో పాటు మిగులు నిల్వ నిధులతో కలిపి రూ.31.36 కోట్ల వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 33 సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) స్కీముల నిర్వహణకు ఖర్చు చేశారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతిభ ఉన్న ఏ ఒక్క క్రీడాకారుడు నిరాశ పడకూడదనే ఉద్దేశంతో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లాలో పలువురికి ఆర్థిక సహాయం అందించారు. విజయనగరంలోని తోటపాలేనికి చెందిన చందక వెంకట్ పవన్ కార్తికేయ అర్జెంటీనాలో వరల్డ్ స్కేటింగ్ పోటీలకు వెళ్లేందుకు ఖర్చుల కోసం రూ.2.65 లక్షలు మంజూరు చేశారు. ప్రపంచ స్థాయిలో విజయనగరం పేరు నిలబెట్టిన నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ శనాపతి గురునాయుడికి రూ.లక్ష బహుమతి అందించారు. దివ్యాంగుల క్రికెట్‌లో ఆడటానికి అవసరమైన కిట్‌ను రూ.46 వేలతో కొనుగోలు చేసి నెల్లిమర్ల మండలం సతివాడ గ్రామానికి చెందిన గణేష్‌కు ఇచ్చారు. టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణ, వసతి ఖర్చుల నిమిత్తం గరివిడి మండలం కొండలక్ష్మీపురానికి చెందిన రెడ్డి మౌనికకు రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు.




