సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి మరోసారి బీసీ మహిళకు అవకాశం కల్పిస్తూ వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గతంలో గొలగాని హరివెంకట కుమారిని మేయర్గా ఎంపిక చేసిన పార్టీ.. ఇప్పుడు మరో బీసీ మహిళకు అగ్రతాంబూలం ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామనే సంకేతాన్ని ఇచ్చింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో తన వైఖరిని మరోసారి చాటుకున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
బీసీ సాధికారతకు మరో అడుగు
బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో వైఎస్సార్సీపీ మొదటి నుంచీ ప్రాధాన్యమిస్తోందని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2021 జీవీఎంసీ ఎన్నికల అనంతరం బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్గా ఎంపిక చేయగా.. ఇప్పుడు అదే పదవికి మరో బీసీ మహిళ అయిన వరుదు కల్యాణిని అభ్యర్థిగా ప్రకటించింది. స్థానిక సంస్థల నుంచి శాసనమండలి వరకు బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న పార్టీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ వంటి కీలక నగర పాలనలో బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మండలిలో ప్రజా సమస్యలపై పోరాటం
ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలను శాసనమండలి దృష్టికి తీసుకెళ్లడంలో వరుదు కల్యాణి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బీసీ సంక్షేమం, మహిళా హక్కులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక కావడంతో శాసనమండలిలో ఆమెకు ఉన్న అనుభవం నగర పాలనకు ఏ మేరకు దోహదపడుతుందన్న ఆసక్తి నెలకొంది.
వ్యవసాయ విద్య.. మేనేజ్మెంట్ పరిజ్ఞానం
బాపట్ల వ్యవసాయ కళాశాల (ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం) నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసిన ఆమె, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఎల్ఎల్బీ పూర్తి చేశారు. చోడవరం నియోజకవర్గానికి చెందిన భర్త గేదల లక్ష్మణ్ సురేష్, ఇద్దరు కుమారులు సిద్ధార్థ్, గౌతమ్లతో కూడిన కుటుంబ నేపథ్యంతోపాటు ఆమె విద్యా నేపథ్యం జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను, స్మార్ట్ ప్రాజెక్టులను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో దోహదపడనుంది.
మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి
వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి
బీసీ మహిళనైన తనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మేయర్గా గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తానన్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తానని తెలిపారు. కూటమి పాలనలో విశాఖ అభివృద్ధి కుంటుపడిందని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా నగరాన్ని అమ్మేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బీచ్ షాక్స్ పేరిట విశాఖ సంస్కృతి, సంప్రదాయాలకు తూట్లు పొడిచారని, సింహాద్రి అప్పన్న కొండను గుండు చేశారని విమర్శించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే జీవీఎంసీలో వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. ప్రజాసేవ కోసం వచ్చిన తనను, పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మరోసారి బీసీ మహిళకే మేయర్ పీఠం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం అధికారికంగా ప్రకటించినవైఎస్సార్సీపీ అధిష్టానం
జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ వరకు..
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన వరుదు కల్యాణి రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థల నుంచే ప్రారంభమైంది. తండ్రి వరుదు బాబ్జీరావు ప్రోత్సాహంతో 2001లో సారవకోట జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరిన ఆమె.. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా, అరకు, విజయనగరం పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జిగా, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 2021 నవంబర్ 12న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.


