సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘పెద్దల తప్పులకు చట్టం చుట్టం కాదు.. చిన్నల తప్పులకు మాత్రం శిక్ష తప్పదు’ అన్న చందంగా విశాఖలోని ఓ ప్రాచీన క్లబ్లో పేకాట వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కూటమికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలతో క్లబ్లో పేకాట దందా సాగుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గతంలో అనధికారిక వ్యక్తులతో ఆటలు ఆడించేందుకు ప్రయత్నించి విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు.. ఈసారి కొత్త సభ్యత్వాల ముసుగులో వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార బలంతో ఏ పనినైనా సులువుగా చక్కబెట్టవచ్చనే ధీమాతో సాగుతున్న ఈ తంతు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే అండతో పావులు!
ఈ వ్యవహారం వెనుక కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్లబ్‌లోని బార్ నిర్వహణను తనకు అనుకూలమైన వ్యక్తికి ఇప్పించుకున్న సదరు ప్రజాప్రతినిధి.. మొత్తం క్లబ్‌పైనా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో బయటి వ్యక్తులతో పేకాట ఆడించేందుకు ఒత్తిడి తెచ్చిన ఆయన.. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహణ సాగించేందుకు కొత్త సభ్యత్వాల మార్గాన్ని ఎంచుకున్నారనే విమర్శలున్నాయి.
ఒక్కో ఆటకు రూ.2 వేల వసూలు?
సాధారణంగా కొన్ని క్లబ్బుల్లో పది ఆటలతో కూడిన ఓ రౌండ్‌కు రూ.1,200 చొప్పున క్లబ్ నిర్వహణ కోసం వసూలు చేస్తుండగా.. సదరు ప్రాచీన క్లబ్లో మాత్రం ఒక్కో ఆటకు రూ.2 వేల చొప్పున.. పది ఆటల రౌండ్‌కు ఏకంగా రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
గెస్టుల నుంచి సభ్యులుగా..
క్లబ్ నిబంధనల ప్రకారం పేకాట ఆడేందుకు అర్హులైన సీనియర్ సభ్యుల సంఖ్య సుమారు 50 మందికి మించదని సమాచారం. అయితే, గత ఏడాది మే నెలలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు బయటి వ్యక్తులను గెస్టులుగా తీసుకొచ్చి పేకాట ఆడించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా క్లబ్‌తో సంబంధం లేని మ రో 200 మంది వరకు బయటి వ్యక్తులు పేకాటలో పాల్గొన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ 2025 మే 28న ‘క్లబ్బుతో గలీజు ఆట’ శీర్షికన కథనం ప్రచురించింది. తాజాగా కొద్దిరోజుల్లోనే 40 మందికిపైగా కొత్త సభ్యత్వాలు కల్పించినట్లు తెలుస్తోంది. అధికారిక సభ్యత్వాల పేరుతో పేకాటను నిరాటంకంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు చేసినా.. చర్యలేవీ?
క్లబ్లో అనర్హులు పేకాట ఆడుతున్నారంటూ కొందరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఒత్తిడితో కేసులు నమోదు చేయకుండానే వారిని విడిచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పోలీసులూ నిర్వాహకులకు సహకరిస్తున్నారనే విమర్శలు రావడం చర్చనీయాంశమైంది. క్లబ్లో పేకాట నిర్వహణకు ఉన్న అనుమతులు, కొత్త సభ్యత్వాల మంజూరు, భారీ వసూళ్లు, గత ఫిర్యాదులపై అధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చి, నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


