బీసీల పక్షపాతి జగన్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీల పక్షపాతి జగన్‌

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

విశాఖ మేయర్‌ సీటు మరోసారి మహిళకే కేటాయింపు అశాసీ్త్రయ వార్డుల విభజనపై ఈసీకి ఫిర్యాదు వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థిగా బీసీ మహిళ వరుదు కల్యాణికి అవకాశం కల్పించడం ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు అన్నారు. గురువారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్‌ పదవికి జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ బీసీ మహిళ అయిన వరుదు కల్యాణిని అభ్యర్థిగా ప్రకటించడం జగన్‌ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు. 2021లోనూ బీసీ మహిళను మేయర్‌గా చేసిన వైఎస్సార్‌సీపీ, ఇప్పుడు మరోసారి అదే సామాజిక వర్గానికి అవకాశం కల్పించిందని తెలిపారు. 11 మంది పేర్లను పరిశీలించిన అనంతరం కల్యాణిని ఎంపిక చేశామని, ఆమె నగర సమస్యలపై శాసనమండలిలో గళం వినిపించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని కన్నబాబు ఆరోపించారు. వార్డుల విభజన పారదర్శకంగా జరగలేదని, వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలను ఇష్టానుసారంగా విభజించారని విమర్శించారు. ఓటరు జాబితాల్లోనూ తొలుత ఒక జాబితా, ఆ తర్వాత మరో జాబితా ప్రకటించారని, వాటిలో ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

‘సేవ్‌ వైజాగ్‌’ నినాదంతో..

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విశాఖను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. గీతం భూములకు సంబంధించి జీవీఎంసీలో తీర్మానం తీసుకొచ్చి భూదోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ‘వైజాగ్‌ ఫర్‌ సేల్‌’ అనేది టీడీపీ నినాదమైతే.. ‘సేవ్‌ వైజాగ్‌’ అనేది వైఎస్సార్‌సీపీ నినాదమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు.

విశాఖ బ్రాండ్‌ను నాశనం చేశారు..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో విశాఖను పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తే, చంద్రబాబు అమరావతిపై ప్రేమతో విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీశారని విమర్శించారు. నగరంలో 60 శాతం మంది ప్రజలు తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. విశాఖ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, మళ్ల విజయ్‌ ప్రసాద్‌, బొత్స అనూష, సీనియర్‌ నాయకులు తైనాల విజయ్‌కుమార్‌, శోభా హేమవతి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, పెడాడ రమణికుమారి, జహీర్‌ అహ్మద్‌, బాణాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement