మేమిచ్చిందే మహాప్రసాదం! | - | Sakshi
Sakshi News home page

మేమిచ్చిందే మహాప్రసాదం!

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

● జీవీఎంసీ సీట్ల పంపకంపై కూటమిలో కుంపట్లు ● 40–50 స్థానాలు కోరిన జనసేన.. 24కే పరిమితం ● సీట్ల లెక్కలపై మిత్రపక్షాల మధ్య వాగ్వాదం ● 50–60 స్థానాల్లో రెబల్స్‌ను దించాలంటూ జనసేనలో చర్చ ● తమ వాటా అడగలేని పరిస్థితిపై బీజేపీ నేతల అసంతృప్తి

సాక్షి, విశాఖపట్నం: అడిగినన్ని సీట్లు ఇవ్వడం కుదరదు.. ఇచ్చిన వాటితోనే సర్దుకుపోవాలి! జీవీఎంసీ ఎన్నికల వేళ కూటమిలో టీడీపీ వైఖరి ఇదేనన్నట్లుగా పరిస్థితి మారింది. తమ బలానికి తగ్గ స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుండగా.. సీట్ల పంపకంలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో జరిగిన చర్చలు జనసేనలో ఆగ్రహాన్ని పెంచాయి. అడిగినన్ని స్థానాలు దక్కకపోతే రెబల్స్‌ను బరిలోకి దించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

24 స్థానాలకే టీడీపీ పట్టు!: జీవీఎంసీ పరిధిలో కనీసం 40 నుంచి 50 కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాలని జనసేన ఎమ్మెల్యేలు కోరినట్లు సమాచారం. అయితే టీడీపీ ఎంపీ భరత్‌ తొలుత 21 స్థానాల ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన ఎమ్మెల్యేలు.. తమ పార్టీ బలంగా ఉన్న వార్డుల వివరాలను ప్రస్తావిస్తూ ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఆయా స్థానాల్లో టీడీపీకి బలం ఉందని, వాటిని జనసేనకు కేటాయించడం సాధ్యం కాదని టీడీపీ నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చివరకు నియోజకవర్గానికి మూడేసి చొప్పున మొత్తం 24 స్థానాలు మాత్రమే ఇస్తామని, అంతకుమించి ఒక్కటి కూడా ఆశించవద్దని భరత్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. తమ వాదనకు విలువ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఓ జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంగా చేతిలోని కాగితాలను విసిరికొట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.

ప్రత్యామ్నాయంగా తిరుగుబాటు బాట: టీడీపీ కార్యాలయంలో పరిణామాలపై అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు తమ పార్టీ కార్యాలయంలో మరోసారి సమావేశమై ప్రత్యామ్నాయాలపై చర్చించినట్లు తెలిసింది. అడిగిన స్థానాలు కేటాయించకపోతే 50 నుంచి 60 వార్డుల్లో స్వతంత్రంగా పోటీ చేయడం లేదా రెబల్‌ అభ్యర్థులను బరిలోకి దించడం వంటి అంశాలను పరిశీలించినట్లు సమాచారం. టీడీపీ ప్రతిపాదనకు అంగీకరిస్తే కేడర్‌లో అసంతృప్తి పెరుగుతుందనే ఆందోళన.. వ్యతిరేకిస్తే పొత్తు దెబ్బతింటుందనే సంకటస్థితి జనసేన నేతలను వేధిస్తోంది. శుక్రవారం మరోసారి సమావేశమై చర్చిద్దామని భరత్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ భేటీతోనైనా సీట్ల వివాదానికి పరిష్కారం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి ప్రాధాన్యమెక్కడ?: కూటమిలో మరో భాగస్వామి బీజేపీ నేతలూ సీట్ల పంపకంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు దక్కాల్సిన స్థానాల కోసం గట్టిగా పట్టుబట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుండగా.. తమ వాటా విషయంలోనూ స్పష్టత లేకపోవడం ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.

యలమంచిలిలోనూ పోటీకి సిద్ధం!: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలోనూ అవే సిగపట్లు కనిపిస్తున్నాయి. గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన అడారి రమణకుమారి పేరును బీజేపీ ఖరారు చేసుకోగా.. స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరఫున మరో అభ్యర్థిని రెబల్‌గా బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement