98 నుంచి 120కి పెంపుతోతలకిందులైన రాజకీయ లెక్కలు
వార్డుల సరిహద్దుల మార్పుతో తాజా మాజీ కార్పొరేటర్లలో గందరగోళం
ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసాలు.. విభజనపై అనేక అనుమానాలు
రిజర్వేషన్ల ఖరారులోనూ అక్రమాలంటూ విపక్షాల ఆరోపణలు
గూగుల్ మ్యాప్స్లో ఓటర్ల వేట.. ప్రచారానికి అష్టకష్టాలు
సాక్షి, విశాఖపట్నం: ‘నిన్నటిదాకా నాది అనుకున్న వీధి.. ఇప్పుడు పక్కోడిదైపోయింది.. ఐదేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంకు.. పరాయి వార్డు పాలైంది!’.. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థుల మనోవేదన ఇది. జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచడంతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకోవడంతో పాటు, ఒక వార్డులో బలంగా ఉన్న ప్రాంతాలను మరో వార్డులో కలిపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో తాజా మాజీ కార్పొరేటర్లు సైతం తాము ఏ వార్డులో పోటీ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు.
నిబంధనలకు తూట్లు.. అడ్డగోలు విభజన
గ్రేటర్ పరిధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం 98 వార్డులను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కూటమి కుట్రలకు తెరతీసింది. అశాసీ్త్రయంగా వార్డుల సంఖ్యను 120కి పెంచింది. కూటమి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న వార్డులను లక్ష్యంగా చేసుకుని వార్డులను ముక్కలు చేశారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారులో అధికారులు కనీస నిబంధనలను కూడా పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రతి వార్డులోనూ దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లు ఉండాలి. సగటు వార్డు జనాభాతో పోలిస్తే 10 శాతానికి మించి వ్యత్యాసం ఉండకూడదు. భౌగోళిక సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వీధులు, ఇళ్లను విడగొట్టకూడదు. అయితే, కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య అత్యధికంగా, మరికొన్ని చోట్ల అత్యల్పంగా ఉండేలా అశాసీ్త్రయంగా విభజించారని ఆరోపణలు వస్తున్నాయి.
‘అధికార’ మోజుతోనే ఈ తిప్పలంట!
ఈ విభజనలో చోటుచేసుకున్న వ్యత్యాసాల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి బలమైన పట్టున్న వార్డులనే లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు తూర్పు నియోజకవర్గంలోని 14, 15, 18, 25, 29 వార్డులు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 67, 68, 81, 82 వార్డులు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 47, 50, 53, 54, 59, 60 వార్డులు, అనకాపల్లి నియోజకవర్గంలోని 107, 109, 111, 112 వార్డుల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షం బలంగా ఉన్న ఈ వార్డుల్లో పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిజర్వేషన్లలోనూ రింగాట
వార్డుల రిజర్వేషన్ల ఖరారులోనూ అధికార దుర్వినియోగం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. తమకు అనుకూలమైన రిజర్వేషన్ ఏదో, ఏ ప్రాంతాలను కలుపుకుంటే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయో లెక్కలేసుకుని మరీ తమ వార్డు సరిహద్దులను సొంత ఇంటి కాంపౌండ్వాల్లా కూటమి నేతలు మార్చుకున్నారంటూ వైఎస్సార్సీపీతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లుగా పనిచేసిన తాజా మాజీలు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తాము ఏ వార్డులో పోటీ చేయాలి? అసలు తమ పాత వార్డు సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాయి? అనే విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొందరు తమ ఓటర్లు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఏకంగా ‘గూగుల్ మ్యాప్స్’ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
సమయం లేదు మిత్రమా..
ఒకవైపు ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. ప్రచారానికి మిగిలిన సమయం చాలా తక్కువ. కొత్తగా ఏర్పడిన 120 వార్డుల భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయేలా ఉంది. కొత్తగా తమ వార్డులో కలిసిన ప్రాంతాలకు వెళ్లి.. పరిచయం చేసుకుని ప్రతి ఇంటికీ తిరగాలంటే నాయకులకు అక్షరాలా చుక్కలు కనిపించడం ఖాయం. ఉరుకులు పరుగులు పెట్టి గట్టిగా శ్రమటోడిస్తే తప్ప, ఈసారి కొత్త వార్డుల్లో కదం తొక్కడం కష్టమేనంటూ నాయకులు హైరానా పడుతున్నారు.


