● ముందస్తు సమాచారం లేకుండా ‘తూతూమంత్రం’గా గ్రామసభలు ● ఉపాధి హామీ పోతే బతికేదెలా? పన్నుల భారం మోసేదెవరు? ● లిఖితపూర్వక హామీ ఇస్తేనే అంగీకరిస్తామన్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

● ముందస్తు సమాచారం లేకుండా ‘తూతూమంత్రం’గా గ్రామసభలు ● ఉపాధి హామీ పోతే బతికేదెలా? పన్నుల భారం మోసేదెవరు? ● లిఖితపూర్వక హామీ ఇస్తేనే అంగీకరిస్తామన్న ప్రజలు

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

● ముందస్తు సమాచారం లేకుండా ‘తూతూమంత్రం’గా గ్రామసభలు ● ఉపాధి హామీ పోతే బతికేదెలా? పన్నుల భారం మోసేదెవరు? ● లిఖితపూర్వక హామీ ఇస్తేనే అంగీకరిస్తామన్న ప్రజలు

విలీనంపై భగ్గుమన్న గ్రామాలు

ఆనందపురం: జీవీఎంసీ పరిధిలోకి గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియపై గ్రామీణులు, ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పారదర్శకత లేకుండా అధికారులు తూతూమంత్రంగా గ్రామసభలు నిర్వహించడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గండిగుండంలో ముక్తకంఠంతో వ్యతిరేకత

విలీనం జరిగితే పేదలకు ఏకైక జీవనాధారమైన ఉపాధి హామీ పథకం పూర్తిగా రద్దవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్ల పాటు ఉపాధి హామీ పనులను యథాతథంగా కొనసాగిస్తామని, పన్నులు విధించబోమని కలెక్టర్‌, ఉన్నతాధికారులు లిఖితపూర్వక భరోసా ఇస్తేనే విలీనాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పారు. అనంతరం గ్రామాన్ని యథావిధిగా పంచాయతీగానే కొనసాగించాలని కోరుతూ స్థానిక ప్రజలు, మహిళలు మూకుమ్మడిగా సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎస్‌.శ్రీనుబాబు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

వేములవలసలో సమస్యలు పరిష్కరిస్తేనే మద్దతు : వేములవలస పంచాయతీలో అధికారులు కొద్దిమంది గ్రామస్తులతోనే మొక్కుబడిగా గ్రామసభను ముగించారు. స్థానికులు మాట్లాడుతూ.. గ్రామంలోని దీర్ఘకాలిక సమస్యలను విలీనానికి ముందే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. చెరువు పనులను మరో పదేళ్లపాటు ఉపాధి హామీ కింద కొనసాగించాలని, ఈ హామీలు నెరవేర్చితేనే విలీనానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కోరాడ అప్పలస్వామినాయుడు, కోరాడ అచ్యుత సాధు రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

ముచ్చెర్లలో ముందస్తు ప్రచారం లేక ఆగ్రహం

ముచ్చెర్లలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడాన్ని స్థానికులు తప్పుబట్టారు. వ్యవసాయం, పశుగ్రాసం, ఉపాధి హామీపై ఆధారపడి జీవిస్తున్న తమపై జీవీఎంసీ విలీనం పిడుగులా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చెర్ల ఇంకా అభివృద్ధి చెందని గ్రామం కావడంతో విలీన ప్రక్రి యను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

గంభీరంలో విలీనంపై ఆందోళన

జీవీఎంసీలో చేరితే ఉపాధి హామీ పనులు రద్దయి బతుకుదెరువు కోల్పోతామనే భయంతో విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని గంభీరం గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. కాగా, షెడ్యూల్‌ ప్రకారం తర్లువాడలో శుక్రవారం జరగాల్సిన గ్రామసభ వాయి దా పడింది.

మొక్కుబడిగా..

తగరపువలస: భీమిలి మండలాన్ని జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన గ్రామసభలు మొక్కుబడిగా ముగిశాయి. ప్రజలెవరూ ఈ సభలపై ఆసక్తి చూపలేదు. విపక్ష నాయకులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు దాటవేశారు. రేఖవానిపాలెం, దాకమర్రి పంచాయతీ ప్రజలు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా.. చిప్పాడ, మూలకుద్దు, తాళ్లవలస, లక్ష్మీపురం, నారాయణరాజుపేట, మజ్జివలస వాసులు పదేళ్లపాటు పన్నులు పెంచవద్దని, ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తేనే విలీనానికి అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఆనందపురం మండలం కణమాం పంచాయతీలో ప్రార్థనా మందిరాలకు రక్షణ, పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రత్యేక వార్డులు కేటాయించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

సొంత పార్టీ నుంచే నిరసన సెగ : చిప్పాడలో నిర్వహించిన గ్రామసభలో టీడీపీ కార్యకర్త సాడి రామకృష్ణ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటివరకు పంచాయతీ ముఖం చూడలేదని,గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడని, ఇటీవల వేసిన రింగ్‌ రోడ్డు నాణ్యత లోపంతో పూర్తిగా పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి లేకుండా చేయొద్దు

పెందుర్తి: జీవీఎంసీలో విలీనం చేస్తే ఉపాధి హామీ పనులు నిలిచిపోతాయని, పన్నుల భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెందుర్తి మండలంలోని గ్రామాల ప్రజలు అధికారుల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడించారు. 15 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా పినగాడి, రాంపురం, గొరపల్లి, సరిపల్లి, పెదగాడి పంచాయతీ ల్లో నిర్వహించిన గ్రామ సభల్లో స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పినగాడిలో జరిగిన గ్రామసభలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ సర్పంచ్‌ బయిలపూడి భగవాన్‌ జయరామ్‌ మాట్లాడుతూ.. విలీనం చేసినా గ్రామాల్లో కనీసం పదేళ్లపాటు ఉపాధి హామీ పనులు కొనసాగించాలన్నారు. ఇంటి పన్నులను కూడా పదేళ్లపాటు ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న స్లాబ్‌ ప్రకారమే వసూలు చేయాలని కోరారు. ఖాళీ స్థలాల పన్ను విషయంలోనూ ప్రజలకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.అప్పలరాజు, మాజీ సర్పంచ్‌లు గొరపల్లి శ్రీను, కేసుబోయిన లావణ్య, నాయకులు రెడ్డి నారాయణరావు, బయిలపూడి హరగోపాల్‌, వెన్నెల పెంటబాబు, బొడ్డు అప్పలరాజు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement