మహారాణిపేట: రాష్ట్రంలో దళితులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. కుల వివక్ష ఇంకా అనేక రూపాల్లో కొనసాగుతోందని, లాకప్ డెత్‌లు, హత్యలు, లాఠీలతో దాడులు, అత్యాచారాలు, కుల దూషణలు, పరువు హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కేవీపీఎస్, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. వాటి పరిష్కారం కోసం ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 50 వార్డులు, 4 మండలాల్లోని 90 కాలనీలలో సర్వే నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు దాటినా వివక్ష కొనసాగుతోందన్నారు. దళితుల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు కావడం లేదని, దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అనేక కాలనీల్లో అమలు కావడం లేదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెవీఎస్.కుమార్ మాట్లాడుతూ గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు రుణాలు ఇచ్చేవారని, ప్రస్తుతం అవి నిలిచిపోయాయన్నారు. కులాంతర వివాహాలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు కూడా నిలిపివేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితులు నివసించే కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయకుండా పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ కార్యదర్శి కె.మహేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వై.రాజు, వై.టి.దాసు, ఎంవీ ప్రసాద్, సుబ్బారావు, గణేష్, సరోజినీ, సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, జగన్, మణి, వెంకటరావు, లక్ష్మణ మూర్తి, రాంబాబు, అప్పలరాజు, ఐద్వా నాయకులు మాధవి, సుమిత్ర, కొండమ్మ, భారతి, విమల, కుమారి తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి


