లారీ డ్రైవర్‌పై దాడి కేసులో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌పై దాడి కేసులో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

మల్కాపురం : మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధి మారుతి సర్కిల్‌ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి చేసిన వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ను మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీస్‌ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల బీరోలాల్‌ సాహు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన మాంగనీస్‌ లోడ్‌ తీసుకుని విశాఖ నగరానికి వస్తున్నాడు. మార్గమధ్యలో మారుతి సర్కిల్‌ వద్ద వెహికల్‌ తనిఖీ చేసే అధికారులు ఒక కారులో వేగంగా వచ్చి, సాహు లారీకి అడ్డంగా పెట్టి పత్రాలను చూపించాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన సాహు.. ‘మీరు అధికారులు అయితే మీ ఐడీ కార్డులు చూపించండి’ అని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన అధికారులు లారీ ఎక్కి డ్రైవర్‌ సీటులో ఉన్న సాహుపై దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కరినేని శ్రీను సాహు ముఖంపై పిడిగుద్దులు గుద్దాడని పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా సాహు గొంతు నులిమి, పొట్టపై బలంగా దాడి చేశాడని పేర్కొన్నారు. అనంతరం సాహు వద్ద ఉన్న రూ.10 వేల నగదును బలవంతంగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడికి భయభ్రాంతుడైన సాహు అక్కడి నుంచి ప్రాణభయంతో వెళ్లిపోయాడు. దాడి ఘటన సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం కావడం, దీనికి తోడు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మల్కాపురం పోలీసులను ఆశ్రయించడం, ఏపీ హైకోర్టు దీనిపై స్పందించడం, పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదృశ్యమైన సాహు ఆచూకీని కనుగొన్న పోలీసులు, అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దాడికి పాల్పడిన శ్రీనును మల్కాపురం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సంబంధం ఉన్న అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ అధికారి పార్వతిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును సీఐ నరసింహరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అప్పలనాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement