సాక్షి, విశాఖపట్నం: ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డు బర్మా కాలనీ పరిధిలోని నెహ్రూనగర్ కప్పరాడలో గల రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని స్థానిక నిరుపేద బర్మా కాందిశీకులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 13/ఏ/14లో ఉన్న ఈ 3 ఎకరాల భూమిని కాపాడాలంటూ ఆదివారం లాసన్స్‌బే కాలనీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజులను బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు.వైఎస్సార్‌సీపీ మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు ఆధ్వర్యంలో నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్య వేదిక కమిటీ ప్రతినిధులు నరసింహులు, అప్పారావు, దీపక్, శీను, బాబు, దేవా, రాజేష్, నారాయణరావు, శివకుమార్, రమేష్‌లతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న ఇటువంటి అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా వైఎస్సార్‌సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ భూకబ్జా వ్యవహారాన్ని రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పలుమార్లు కలెక్టర్‌కు విన్నవించుకున్నా చర్యల్లేవు
అనంతరం మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు, ఐక్య వేదిక ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం బర్మా కాందిశీకులకు నివాసాల నిమిత్తం ఈ సర్వే నెంబరులో స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. నివాసాల నిర్మాణం పోను మిగిలిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం కొందరు అక్రమార్కులు గూండాలతో కలిసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అక్కడ అనధికారికంగా ప్రైవేట్ షెడ్లు నిర్మించడమే కాకుండా, వాటికి యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.పేదలకు ఇళ్లు ఇస్తున్నామనే నెపంతో అడ్డగోలుగా ఇప్పటివరకు 40కు పైగా అక్రమ షెడ్లను నిర్మించి, ఒక్కో షెడ్డును రూ.4 లక్షల చొప్పున అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.80 వేల వరకు పలుకుతోందని, ఈ లెక్కన వంద కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా ఇళ్లు లేని కాందిశీకులు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వం వారిని గుర్తించి అర్హులైన వారికి మాత్రమే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో ఈ భూమిని కాపాడాలని జీవీఎంసీ కౌన్సిల్లో కూడా పలుమార్లు మాట్లాడినట్లు అల్లు శంకర్ రావు గుర్తుచేశారు. ఈ భూకబ్జాపై కలెక్టర్‌కు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి, రెవెన్యూ అధికారులకు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కబ్జాను ప్రశ్నిస్తే.. తమకు స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తామంటూ అక్రమార్కులు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.


